దశాబ్దాల తెలంగాణ పోరాటం వెనుక ఉన్న మొదటి ఆకాంక్ష నీళ్లు. బీడువారిన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసి, గుక్కెడు నీళ్ల కోసం ఆకాశం వంక చూసే రైతుల కళ్లలో ఆనందం చూడాలన్నదే ఆనాటి ఉద్యమ లక్ష్యం. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి 2023 వరకు పాలకుల రాజకీయ క్రీడలో తెలంగాణ సాగునీటి రంగం, ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణ జీవనాడి, రైతుల ఆశాకిరణం 'ప్రాణహిత-– చేవెళ్ల' ప్రాజెక్టు తీవ్ర వివక్షకు గురవుతోంది.
నెర్రెలు బారిన నేలలను తడుపుతుందని భావించిన ఈ ప్రాజెక్టు కేంద్రంలోని బీజేపీ సర్కారు శీతకన్నుతో, నాటి రాష్ట్ర పాలకుల స్వార్థ రాజకీయాలకు సమిధగా మారిపోయింది. కానీ నాడు ఈ ప్రాజెక్టుకు ప్రాణం పోసిన కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుండి తుమ్మిడిహెట్టి కోసం నిర్విరామ ప్రయత్నాలు చేస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రివ్యూలు చేయడంతోపాటు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆదిలాబాద్ ఇంచార్జ్ మంత్రి జూపల్లి, స్థానిక మంత్రి వివేక్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం సఫలం కావాలంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంకుచిత రాజకీయాల్ని వదిలి ప్రజా క్షేమం కోసం ఆలోచన చెయ్యాలి.
- 'ప్రాణహిత-చేవెళ్ల'పై కేంద్రం నిర్లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలతోగానీ, వారి భావోద్వేగాలనుగానీ కనీసం పట్టించుకోకుండా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను పోలవరం కోసం రాత్రికి రాత్రే లాక్కొని ఏపీలో కలిపేసింది. పోలవరం ప్రాజెక్టుకు నిధుల్ని కురిపిస్తోంది, అయితే అది త్వరగా పూర్తవ్వాలన్నది, పొరుగు రాష్ట్ర రైతాంగం బాగుపడాలనేది ఎవరూ కాదనరు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-- చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు బీజం వేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పట్లో రాష్ట్ర విభజన చట్టం చేసి తెలంగాణ ఇవ్వడమే కాకుండా ప్రాణహిత-– చేవెళ్లకు ఏఐబీపీ కింద కేంద్రం నిధులు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇవాళ అదే ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలి.
- ప్రాణహిత నీటిని వాడుకోవాలనే సంకల్పం
నాటి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు 160 టీఎంసీలకు పైగా గోదావరి జలాల్ని తరలిస్తూ మొత్తం 16.5 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చే అద్బుత ప్రాజెక్టు ఇది. ఇందులో కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే దాదాపు 4 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. గ్లోబల్ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్ది, జనాభా ఎంత పెరిగినా సాగునీటికి ఇబ్బందే రాకుండా 30 టీఎంసీలు అందించాలని నాడే కాంగ్రెస్ ముందుచూపును ప్రదర్శించింది.
చాలా నిధులతో కాలువల తవ్వకం పనులు, భారీ టన్నెల్ పనులను అప్పట్లోనే యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. దాదాపుగా 90 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, వారికి లోపాయికారీగా వంతపాడిన బీజేపీ నేతలు కలిసి ప్రాణహిత – చేవెళ్లను ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారు.
ఇందుకోసం 2016లో ఏకంగా నాటి తెలంగాణ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి కలిసి కొత్త పేచీని తీసుకొచ్చి ప్రాజెక్ట్ ఎత్తును 148 మీటర్లకు కుదించి తెలంగాణ గొంతు కోశారు. కమీషన్లను దండుకోవాలనే ఈ ప్రాజెక్టును ఆపేశారనేది అప్పట్లోనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రాజెక్టు పేరు మార్చి రీ-డిజైనింగ్ అనే వాదన తెరపైకి తెచ్చి, ప్రాజెక్టును ఎత్తిపోతల పథకంగా మార్చి తెలంగాణ ప్రజల నెత్తిన చెప్పలేనంత ఆర్థిక భారం మోపారు.
- గ్రావిటీ ద్వారానే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లు
సాంకేతికంగా, భౌగోళికంగా చూసుకుంటే ప్రాణహిత-– చేవెళ్ల అసలు డిజైన్ అత్యంత అద్భుతమైనది. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే, అక్కడి నుంచి ఎటువంటి భారీ మోటార్లు, పంపింగ్ లేకుండా కేవలం గ్రావిటీ ద్వారానే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లొస్తాయి.
అక్కడి నుంచి తెలంగాణలోని లక్షలాది ఎకరాలకు గోదావరి జలాలు తరలెల్లి సస్యశ్యామలం చేస్తాయి. దీనివల్ల ప్రతి ఏటా ఎత్తిపోతల కోసం అయ్యే వేలాది కోట్ల రూపాయల కరెంటు బిల్లుల భారం తెలంగాణ ఖజానాకు శాశ్వతంగా తప్పుతుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. ఇక ప్రాణహిత-– చేవెళ్ల ద్వారా అత్యధికంగా లబ్ధిపొందే ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే బీజేపీకి అత్యధిక ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉంది.
ఈ అనుకూల రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న చిన్నపాటి అడ్డంకులను తొలగించి, ప్రాజెక్టుకు అన్ని రకాల కేంద్ర అనుమతులు ఇప్పించాలి. ఇది వారి కర్తవ్యం కూడా. తద్వారా బీజేపీ, కేంద్రం చిత్తశుద్ధిని తెలంగాణ ప్రజలకు చూపించే ద్భుత అవకాశం కూడా. ప్రాణహిత-– చేవెళ్లలో కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంలో రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాల్లా కాకుండా పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన సమయమిది.
- తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డిలు మహారాష్ట్రలోని తమ బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి 150 మీటర్లతో బ్యారేజీని సాధించడంలో, వేగంగా అనుమతులు తీసుకురావడంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ అని నిరంతరం నినదించే ప్రధాని మోదీ ఆ నినాదాన్ని తెలంగాణ విషయంలో ఆచరణలో చూపాలి. తుమ్మిడిహెట్టితో తెలంగాణ సస్యశ్యామలం అయితే, ఇక్కడి వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు అనూహ్యంగా పెరుగుతాయి.
తద్వారా పారిశ్రామిక, సేవా రంగాలతో సహా అన్ని రంగాల్లో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. 3 ట్రిలియన్ ఎకానమీతో దేశ ఆర్థిక ప్రగతికి తెలంగాణ ఒక పటిష్టమైన గ్రోత్ ఇంజిన్‌లా తనవంతు భారీ సహకారం అందిస్తుంది. క్రెడిట్ పంచాయితీలను పక్కన పెట్టి, కుట్రల్ని వదిలేసి, ఇగోలకు దూరంగా తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఇక్కడి రాజకీయ నేతలు పనిచేయాలి.
- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
సీఈవో,
టిసాట్ నెట్వర్క్
