నాలుగు పరీక్షల రద్దుతో ఆందోళనలో అభ్యర్థులు

 నాలుగు పరీక్షల రద్దుతో ఆందోళనలో అభ్యర్థులు
  • గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు
  • ఏఈఈ, డీఏవో ఎగ్జామ్స్ కూడా.. ప్రకటించిన టీఎస్​పీఎస్సీ
  • ఇప్పటికే ఏఈ ఎగ్జామ్ రద్దు.. మరో రెండు పరీక్షల వాయిదా
  • జూన్ 11న మళ్లీ ప్రిలిమ్స్.. మిగతా పరీక్షలు ఎప్పుడనేది చెప్పని కమిషన్
  • ఇప్పటికే రాసిన నాలుగు పరీక్షల రద్దుతో ఆందోళనలో అభ్యర్థులు
  • లీకేజీలో రాజశేఖర్​దే కీలక పాత్ర.. కమిషన్​కు సిట్​ నివేదిక
  • 9 మంది నిందితులను సిట్​ కస్టడీకి అప్పగించిన నాంపల్లి కోర్టు


హైదరాబాద్, వెలుగు: ప్రశ్నపత్రాలు లీక్ ​కావడంతో గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. దాంతోపాటు ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేసింది. జూన్​ 11న మళ్లీ గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని, ఏఈఈ, డీఏవో పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. క్వశ్చన్ పేపర్ల లీకేజీపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) తన నివేదికను కమిషన్​కు అందించింది. శుక్రవారం టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన కమిషన్ కమిటీ సమావేశమై దీనిపై చర్చించింది. ఇప్పటికే అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ), టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ పేపర్లు లీకైనట్టు గుర్తించగా, ఇప్పుడు గ్రూప్​1 ప్రిలిమ్స్​ సహా మూడు పేపర్లు లీక్ అయినట్లు సిట్ విచారణలో తేలింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్​ లో ఎలాంటి ప్రిపరేషన్​ లేకుండా పేపర్ లీకేజీ నిందితుడు ప్రవీణ్ కు ఏకంగా 103  మార్కులు రావడంపై వచ్చిన అనుమానాలు దీంతో నిజమని తేలాయి. అక్టోబర్ నుంచి జరిగిన అన్ని పరీక్షల క్వశ్చన్ పేపర్లను ప్రవీణ్ లీక్ చేసినట్టు సిట్ గుర్తించింది. దీంతో గతేడాది అక్టోబర్16న జరిగిన గ్రూప్1 ప్రిలిమ్స్, ఈ ఏడాది జనవరి 22న జరిగిన ఏఈఈ ఎగ్జామ్, ఫిబ్రవరి 26న జరిగిన డీఏవో ఎగ్జామ్స్ ను రద్దు చేయాలని నిర్ణయించింది.

ఏడు ఎగ్జామ్స్ జరిగితే.. నాలుగు రద్దు

2022లో వివిధ డిపార్ట్​ మెంట్లలోని 17 వేలకుపైగా పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ 26 నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటిలో ఇప్పటివరకూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ తోపాటు మొత్తం ఏడు పరీక్షలు జరిగాయి. ఈ ఏడింటిలో నాలుగు పరీక్షల పేపర్లు లీక్ అయినట్టు సిట్ విచారణలో తేలింది. దీంతో వాటిని రద్దు చేయగా, మరో రెండు పరీక్షలను వాయిదా వేశారు. అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ), గ్రూప్ 1 ప్రిలిమ్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్(డీఏవో) పరీక్షలు రద్దు కాగా, టౌన్ ప్లానింగ్ బోర్డు ఆఫీసర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. అయితే, ఇప్పటికే పరీక్షలు పూర్తయిన సీడీపీవో, ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్, ఎక్స్​టెన్షన్ ఆఫీసర్ పోస్టుల క్వశ్చన్ పేపర్లు వేరే కంప్యూటర్​లో ఉండటంతో, వాటిని లీక్ చేయలేకపోయారని అధికారులు చెప్తున్నారు.

సిట్ రిపోర్ట్​లో కీలక అంశాలు

పేపర్ లీకేజ్‌‌‌‌ కేసులో సిట్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ టీఎస్‌‌‌‌పీఎస్సీకి చేరింది. బేగంబజార్ పోలీసుల ఇన్వెస్టిగేషన్‌‌‌‌, సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌, ఫోరెన్సిక్‌‌‌‌ రిపోర్ట్స్‌‌‌‌తో సిట్‌‌‌‌చీఫ్‌‌‌‌ ఏఆర్ శ్రీనివాస్‌‌‌‌ టీఎస్‌‌‌‌పీఎస్సీకి నివేదికను అందించారు. ఏఈ పేపర్‌‌‌‌ గత నెల 27న లీకైందని, గ్రూప్‌‌‌‌–1 పేపర్‌‌‌‌‌‌‌‌ కూడా లీక్ అయ్యిందని తెలిపారు. లీకేజీ కేసులో కీలకాంశాలను నివేదికలో వెల్లడించారు. పేపర్ హ్యాక్ చేయడంలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌‌‌‌గా పనిచేసిన రాజశేఖర్‌‌‌‌ ‌‌‌‌కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు. ప్రవీణ్‌‌‌‌ సూచనలతో డైనమిక్‌‌‌‌ ఐపీని, స్టాటిక్‌‌‌‌ ఐపీగా మార్చినట్లు చెప్పారు. సెక్షన్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ శంకరలక్ష్మీ తన పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌ ఎక్కడా  రాయలేదని, శంకరలక్ష్మికి చెందిన కాన్ఫిడెన్షియల్ సిస్టమ్‌‌‌‌ను రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ హ్యాక్ చేశాడని వెల్లడించారు. ఐదు పేపర్లకు సంబంధించిన ఫోల్డర్‌‌‌‌‌‌‌‌ను కాపీ చేసి ప్రవీణ్‌‌‌‌కు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే గ్రూప్‌‌‌‌1 పేపర్‌‌‌‌‌‌‌‌ను కూడా రాజశేఖర్, ప్రవీణ్‌‌‌‌ హ్యాక్ చేసినట్టు నిర్ధారించారు.

నిందితులకు 6 రోజుల కస్టడీ

పేపర్ల లీక్​ కేసులో ప్రవీణ్‌‌‌‌, రాజశేఖర్, రేణుక సహా మొత్తం 9 మంది నిందితులను పోలీస్‌‌‌‌ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శనివారం నుంచి ఈ నెల 23 వరకు ఆరు రోజుల పాటు కస్టడీ విధించింది. దీంతో చంచల్‌‌‌‌గూడ జైల్లో ఉన్న నిందితులను శనివారం ఉదయం సిట్‌‌‌‌ తమ కస్టడీలోకి తీసుకోనుంది. పేపర్ లీకేజీల పూర్తి వివరాలు రాబట్టనుంది. ఇంకా ఎంతమందికి పేపర్ షేర్ చేశారనే వివరాలు సేకరించనుంది. గ్రూప్‌‌‌‌1 ఎంత మంది రాశారనే కోణంలో నిందితులను విచారించే అవకాశం ఉంది.

ఆందోళనలో నిరుద్యోగులు

టీఎస్‌‌‌‌పీఎస్సీ పేపర్ల లీకేజీతో నిరుద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రూప్‌‌‌‌1 ప్రిలిమ్స్, డీఏవో, ఏఈఈ, ఏఈ ఎగ్జామ్స్ రద్దు కావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలకు సెలవు పెట్టి ప్రిపేర్ అవుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, సెలవులు దొరక్క ఉద్యోగాలను వదిలిపెట్టి ప్రిపేర్ అవుతున్న ప్రైవేటు ఉద్యోగులు, అప్పులు చేసి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. ప్రిపరేషన్ కొనసాగించాలో, ఆపేయాలో తేల్చుకోలేక మదనపడుతున్నారు. గ్రూప్‌‌‌‌ 1 ప్రిలిమ్స్‌‌‌‌ క్వాలిఫై అయిన 25 వేల మంది, ఇంకో 3 నెలల్లో జరగాల్సిన మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ 3, 4 నెలలు కుటుంబ పోషణ కోసం కూడబెట్టుకున్న సొమ్ము, అప్పులతో మేనేజ్‌‌‌‌ చేద్దామని భావించిన వాళ్లంతా, ఇప్పుడు ప్రిలిమ్స్ రద్దు కావడంతో ఆందోళనలో పడిపోయారు. జూన్‌‌‌‌లో మెయిన్స్ జరగాల్సి ఉండగా, రద్దయిన ప్రిలిమ్స్‌‌‌‌ను మళ్లీ జూన్‌‌‌‌లో నిర్వహిస్తామని టీఎస్‌‌‌‌పీఎస్సీ ప్రకటించింది. జూన్‌‌‌‌లో ప్రిలిమ్స్ నిర్వహిస్తే, వాటి రిజల్ట్‌‌‌‌కు, మెయిన్స్ నిర్వహణకు ఇంకో ఆరు నెలలైనా పడుతుంది. మరోవైపు, ఈ ఏడాది చివరలో జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి. ఆ సమయంలో గ్రూప్ 1 మెయిన్స్ జరుగుతాయా? లేదా? అనేది సందేహమేనని నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్లతో తమకు సెలవులు కూడా దొరకవని ప్రిపరేషన్‌‌‌‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకో ఏడాది ప్రిపేర్ అవడానికి డబ్బులు ఎట్లా పెట్టాలని నిరుద్యోగులు, ప్రైవేటు ఉద్యోగాలు వదిలేసిన వాళ్లు మదనపడుతున్నారు.


న్యాయం చేయాలి

నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్ కోసం సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న సమయంలో పేపర్ లీక్ అంటూ రద్దు చేశారు. ఎవడో తప్పు చేస్తే నిజాయతీగా పరీక్ష రాసిన వేలాది మంది అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోకుండా, ఎగ్జామ్​ను పూర్తిగా రద్దు చేయడం అన్యాయం. తప్పు చేసిన వారిని గుర్తించి శిక్షించాలి కానీ, అందరికీ శిక్ష వేయడం సరికాదు. టీఎస్​పీఎస్సీ పునరాలోచించి అభ్యర్థులకు న్యాయం చేయాలి.
- పిట్ల సరిత, గ్రూప్1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థి

వాయిదా పడ్డ పరీక్షలు 

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్.. 172 పోస్టులు

టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్​ ఎగ్జామ్ ఈ నెల 12న జరగాల్సి ఉండగా, 11వతేదీ రాత్రి పరీక్ష వాయిదా వేస్తున్నట్టు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. అప్పటికే వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ సిటీకి పరీక్ష రాసేందుకు అభ్యర్థులు చేరుకున్నారు. రాత్రికిరాత్రే సిస్టమ్ హ్యాక్ అయిందని ఎగ్జామ్​ వాయిదా వేశారు. 175 పోస్టులకు 33,342 మంది అప్లై చేశారు.

వెటర్నరీ సర్జన్.. 185 పోస్టులు

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష ఈనెల 15,16 తేదీల్లో జరగాల్సి ఉంది. 185 పోస్టులకు భారీగానే అప్లికేషన్లు వచ్చాయి. దీన్ని కూడా ఈ నెల 11న రాత్రి వాయిదా వేశారు. ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని ప్రకటించలేదు.