గ్రూప్1లో తప్పులు జరగలె.. అభ్యర్థులకు టీఎస్​పీఎస్సీ వివరణ

గ్రూప్1లో తప్పులు జరగలె.. అభ్యర్థులకు టీఎస్​పీఎస్సీ వివరణ

హైదరాబాద్, వెలుగు: గ్రూప్​1 ప్రిలిమ్స్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదని టీఎస్​పీఎస్సీ తెలిపింది. ఓఎంఆర్​ షీట్లు ఎక్కువ రావడంపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గురువారం కమిషన్ వివరణ ఇచ్చింది. కొన్నేండ్లుగా టీఎస్​పీఎస్సీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తూ, మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేస్తోందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జూన్11న గ్రూప్1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించి, కలెక్టర్ ఆఫీసుల నుంచి టెలిఫోన్ ద్వారా హాజరైన అభ్యర్థుల వివరాలను సేకరించినట్లు పేర్కొన్నది. 

మొత్తం 33 జిల్లాల్లో 994 కేంద్రాల్లో 2.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని, పారదర్శకత కోసం ప్రాథమిక వివరాలను మీడియాకు రిలీజ్ చేశామని, దాని ప్రకారం అప్పట్లో 2,33,248 మంది హాజరైనట్టు పేర్కొన్నామని, ఆ తర్వాత స్కానింగ్ ప్రక్రియలో 2,33,506  ఓఎంఆర్​ షీట్లను ఫైనలైజ్ చేసినట్టు టీఎస్​పీఎస్సీ పేర్కొన్నది. వందలాది కేంద్రాల్లో లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనప్పుడు.. ప్రాథమిక వివరాలకు, స్కానింగ్ ఓఎంఆర్ వివరాలకు కొంత తేడా ఉంటుందని తెలిపింది. ఫైనల్ లెక్కల సమయంలో చిన్నచిన్న వ్యత్యాసాలు ఎప్పూడూ ఉంటాయని వివరణలో స్పష్టం చేసింది. కొందరు ఆరోపిస్తున్నట్టు పరీక్ష తర్వాత కొత్తగా ఓఎంఆర్ షీట్లను యాడ్ చేసే అవకాశమే లేదని తెలిపింది.