- ప్రైవేట్ కాలేజీల కంటే మంచి పర్ఫార్మెన్స్
- టీఎస్ఆర్జేసీల్లో 97.03 శాతం ఉత్తీర్ణత
- సత్తా చాటిన సోషల్, బీసీ వెల్ఫేర్ విద్యార్థులు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గురుకులాలు సత్తాచాటాయి. ప్రైవేట్మేనేజ్మెంట్ల కంటే గురుకులాలు చాలా ముందున్నాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లోనూ టీఎస్ ఆర్జేసీ కాలేజీలు టాప్‌లో నిలిచాయి. ఫస్టియర్‌లో 90.03శాతం మంది పాస్ కాగా, సెకండియర్‌లోనూ 97.03 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 16 రకాల మేనేజ్మెంట్ల కాలేజీలు ఉండగా, దాంట్లో టాప్‌లో ఏడు గురుకులాలు, సర్కారు విద్యాసంస్థలే ఉండటం గమనార్హం. ప్రైవేట్ కాలేజీలు 8వ స్థానంలో నిలిచాయి. కంపోనెంట్ కాలేజీలు, కో–ఆపరేటివ్ కాలేజీలు, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు చివరి స్థానంలో నిలిచాయి.
బీసీ వెల్ఫేర్ (90.31%), సోషల్ వెల్ఫేర్ (88.43%), మైనారిటీ రెసిడెన్షియల్( 88.41%), ట్రైబల్ వెల్ఫేర్ (86.20%) కాలేజీలు, కేజీబీవీలు (85.14%) సెకండియర్ ఫలితాల్లో 85 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించాయి. ఇక్కడ చదువుతున్న విద్యార్థుల్లో అత్యధికులు పేద కుటుంబాలకు చెందినవారే. అయితే, కాలేజీల్లో సరైన పర్యవేక్షణ, మంచి టీచింగ్ తో ప్రైవేట్ కాలేజీల కంటే మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు చెప్తున్నారు. ఒకవైపు గురుకులాలు దూసుకుపోతుంటే, సాధారణ సర్కారు జూనియర్ కాలేజీలు మాత్రం వెనుకబడ్డాయి. గవర్నమెంట్ కాలేజీల్లో సెకండియర్ పాస్ పర్సంటేజీ కేవలం 60.82 శాతానికే పరిమితమైంది. ఫస్టియర్ లో (42.51%) పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది
