ఆర్టీసీ చర్చలు మళ్లీ విఫలం

ఆర్టీసీ చర్చలు మళ్లీ విఫలం
  • విలీనం విధివిధానాలపై కమిటీకి జేఏసీ పట్టు
  • టైం కావాలంటూ రాత పూర్వక హామీ ఇచ్చిన త్రిసభ్య కమిటీ
  • లెటర్‌‌పై సభ్యుల సంతకాలు లేవన్న జేఏసీ..
  • నేడు మరోసారి చర్చలు.. 5న సమ్మె చేస్తం: అశ్వత్థా మరెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగుఆర్టీసీ జేఏసీతో త్రిసభ్య కమిటీ చర్చలు మళ్లీ విఫలమయ్యాయి. విలీనం, సమస్యలపై కమిటీ ఎలాంటి హామీ ఇవ్వలేదని, 5న సమ్మె మొదలవుతుందని జేఏసీ స్పష్టం చేసింది. గురువారం హైదరాబాద్‌‌లో కమిటీతో జేఏసీ చర్చలు జరిపింది. విలీనంపై విధివిధానాల కమిటీ వేస్తే సమ్మెకు పోమని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కోరారు. కొన్ని డిమాండ్లపై రాతపూర్వక హామీ ఇస్తున్నట్లు కమిటీ లేఖ ఇచ్చినా లెటర్‌‌పై సభ్యుల సంతకాలు లేకపోవడంతో జేఏసీ నేతలు బయటికి వచ్చేశారు. శుక్రవారం కూడా చర్చలు జరుగనున్నాయి.  ఆర్టీసీ విలీనంపై కమిటీ ఎలాంటి హామీ ఇవ్వలేదని, 5వ తేదీన సమ్మె చేస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. తమతో చర్చలు జరుపుతూనే మరోపక్క ఆర్టీఏ అధికారులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎస్మాలతో తమను భయపెట్టలేరని చెప్పారు. తమ కష్టాన్ని, శ్రమను విస్మరిస్తూ సంస్థను నాశనం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వ చర్యలు లేవన్నారు.

గతంలో వేసిన నిపుణుల కమిటీ నివేదికే ఇప్పటివరకు రాలేదని మండిపడ్డారు. సమ్మె అనివార్యమైందని, ప్రజలు సహకరించాలని కోరారు. ప్రైవేటు వాళ్లతో బండ్లు నడిపిస్తే గతంలో ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. తాము డబుల్ డ్యూటీ చేసినా రూ.1,500 ఇవ్వరని, అలాంటిది ప్రైవేటు వారికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై కార్మిక శాఖ జోక్యం చేసుకోవాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి విధివిధానాల కమిటీ వేయాలని కోరామన్నారు. ఆర్టీసీకి‌‌ రావాల్సిన బకాయిలిస్తే నష్టాలు ఉండవన్నారు. అన్ని యూనియన్లను చర్చలకు పిలవాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ వన్‌‌ కన్వీనర్‌‌ హనుమంతు ఆధ్వర్యంలో కమిటీకి వినతిపత్రం అందజేశారు.

స్ట్రైక్‌‌ వద్దు: సోమేశ్

రాష్ట్రంలో దసరా ముఖ్య పండుగని, అందుకే సమ్మె ప్రయత్నాలు విరమించాలని యూనియన్లను కోరామని త్రిసభ్య కమిటీ చైర్మన్ సోమేశ్‌ కుమార్ చెప్పారు. 26 డిమాండ్లపై చర్చించామని, వారం టైం ఇవ్వాలని అడిగామని, అప్పుడూ నమ్మకపోతే వారికి నచ్చినట్టు చేయొచ్చని స్పష్టం చేశారు. శుక్రవారం మరోసారి వాళ్లతో మాట్లాడతామని పేర్కొన్నారు. ఆదరా బాదరాగా నిర్ణయం తీసుకోలేమని కమిటీ సభ్యుడు రామకృష్ణారావు అన్నారు. దాని వల్ల అందరికీ నష్టం జరుగుతుందని చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు మరో సభ్యుడు సునీల్‌‌శర్మ తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చినప్పటి నుంచి ఎస్మా అమల్లో ఉంటుందన్నారు.