- టీఎస్‌టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ కుమార్
హైదరాబాద్, వెలుగు: జేఎన్టీయూహెచ్ పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో నిర్వహించే 'ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (ఎఫ్ఎఫ్ సీ)' తనిఖీలు నామమాత్రంగా సాగకూడదని, వాటిని పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని తెలంగాణ స్టేట్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ( టీఎస్‌టీసీఈఏ) డిమాండ్ చేసింది. బుధవారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
కాలేజీ మేనేజ్మెంట్లు చెప్పే అబద్ధాలను పక్కన పెట్టి, క్షేత్రస్థాయి వాస్తవాలను యూనివర్సిటీ పరిశీలించాలని ఎఫ్ఎఫ్ సీని కోరారు. రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో అర్హత లేని ప్రిన్సిపాళ్లు ఉన్నట్లు జేఎన్టీయూహెచ్ స్వయంగా అంగీకరించిందని సంతోష్ కుమార్ గుర్తు చేశారు. అర్హత లేని వారు కీలక పదవుల్లో ఉన్నప్పుడు ఆ కాలేజీలకు అఫిలియేషన్ (అనుమతులు) ఎలా ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు.
అటువంటి కాలేజీల జాబితాను వెంటనే యూనివర్సిటీ వెబ్ సైట్‌లో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.కాలేజీలు టీఏఎఫ్ఆర్‌సీ, యూనివర్సిటీలకు ఇచ్చే అఫిడవిట్లలో ఏడో వేతన సంఘం ప్రకారం జీతాలు ఇస్తున్నామని తప్పుడు సమాచారం ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అఫిడవిట్లను నమ్మకుండా లెక్చరర్ల ఫామ్ 16, ఫామ్ 26 ఏఎస్ తో పాటు ఏడాది కాలపు బ్యాంక్ స్టేట్‌మెంట్లను తనిఖీ చేయాలని సూచించారు. అప్పుడే మేనేజ్మెంట్ల అసలు మోసాలు బయటపడతాయని, అధ్యాపకులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
