20న కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగుల చలో అసెంబ్లీ

20న కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగుల చలో అసెంబ్లీ

హైదరాబాద్, వెలుగు: కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు టీఎస్‌‌‌‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది 29 రోజుల సమ్మె అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో జరిగిన చర్చల సందర్భంగా అంగీకరించిన అంశాలు ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదన్నారు. దీంతో సర్కారు తీరుపై మూడు దశల పోరాట కార్యాచరణను రూపొందించినట్లు పేర్కొన్నారు.

ఈ నెల 9న స్కూళ్లలో నల్లబ్యాడ్జీలతో నిరసన, 16న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 20 చలో అసెంబ్లీ నిర్వహిస్తామని తెలిపారు. ఎస్​వోలను ప్రిన్సిపాళ్లుగా, పీజీసీఆర్‌‌‌‌టీలను జేఎల్‌‌‌‌లుగా గుర్తించి, కనీస మూల వేతనం చెల్లించాలని, ఉద్యోగులకు తక్షణమే హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాత్రి కాపలా డ్యూటీల నుంచి మహిళా సిబ్బందికి విముక్తి కల్పించేందుకు కేర్ టేకర్లను నియమించాలని, పీఏబీలో వేతనాల పెంపునకు ప్రతిపాదనలు పంపాలని కోరారు.