శ్రీవాణి టికెట్లపై అసత్య ప్రచారాలు నమ్మవద్దు.. భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

శ్రీవాణి టికెట్లపై అసత్య ప్రచారాలు నమ్మవద్దు.. భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌పై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి చేసింది. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఈ విషయంలో పూర్తి స్పష్టతనిచ్చింది.2019 మే నెలలో ప్రవేశపెట్టిన శ్రీవాణి టికెట్ బుకింగ్ విధానాన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు టీటీడీ నిరంతరం కృషి చేస్తోంది. ముఖ్యంగా 2024 జూన్ నుండి భక్తులకు సురక్షితమైన సేవలు అందించేలా అత్యంత పటిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది.

శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్‌ను హ్యాక్ చేయడం కానీ, ఆ వ్యవస్థలో చొరబడటం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అయితే, కొందరు దళారులు ఏఐ ఆధారిత ఆటో-ఫిల్లింగ్, ఆటో-కాపీయింగ్ వంటి పద్ధతుల ద్వారా వేగంగా టికెట్లు బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు టీటీడీ గుర్తించింది. ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను సాంకేతిక విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అక్రమ బుకింగ్‌లను నిరోధిస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన పారదర్శక బుకింగ్‌ను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. భక్తులు కేవలం అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని టీటీడీ కోరింది.