రామచంద్రాపురం, వెలుగు: దైవ చింతనతోనే మానసిక ప్రశాంతతం లభిస్తుందని, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. సోమవారం సంగారెడ్డి జిల్లా భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీ రామాలయాన్ని సందర్శించారు. ఆలయంలో త్వరలో ప్రతిష్ఠించనున్న 27 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎల్ఐజీ కాలనీలోని పోచమ్మ దేవాలయాన్ని దర్శించుకున్నారు.
ఆలయ కమిటీ సభ్యులు బీఆర్నాయుడు దంపతులకు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు, దేవాలయాల నిర్మాణాలకు తనవంతు సాయం అందిస్తానని అన్నారు.
కరీంనగర్ లో రూ. 75 కోట్లతో, కొడంగల్లో రూ.114 కోట్లతో ఆలయాలు నిర్మించబోతున్నట్లు వివరించారు. ఖమ్మం, సిద్ధిపేట, దుబ్బాక, మంథని తదితర ప్రాంతాల్లో ఆలయాలతో పాటు ధార్మిక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో గురజాల శ్రీనివాస్, యాదగిరి రెడ్డి, సత్యనారాయణ, యాదయ్యగౌడ్, మురళీకృష్ణ, చెన్నకేశవ రావు, సీవీఎస్ కుమార్ పాల్గొన్నారు.
