హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠాల వేట.. మహేశ్వరంలో రూ. కోటి హాష్ ఆయిల్ సీజ్

హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠాల వేట.. మహేశ్వరంలో రూ. కోటి హాష్ ఆయిల్ సీజ్
  • కేపీహెచ్‌బీ, జన్వాడలో పలు రకాల డ్రగ్స్​ స్వాధీనం

ఇబ్రహీంపట్నం/ మెహిదీపట్నం/కూకట్​పల్లి/ చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్​పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో భారీగా డ్రగ్స్​పట్టుబడ్డాయి. ఒడిశా నుంచి హైదరాబాద్​కు తరలిస్తున్న సుమారు 9.4 కిలోల హాష్ ఆయిల్​ను మహేశ్వరం పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ కలిపి పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుందని మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. 

ఒడిశాలోని రాజారావు వద్ద ఏపీలోని అల్లూరి జిల్లాకు చెందిన చంటి బాబు ఈ డ్రగ్స్​ను సేకరించి నగరంలోని గుర్తుతెలియని వ్యక్తులకు సరఫరా చేసేందుకు ప్రయత్నించాడు. మార్చి 29న మహేశ్వరం గేట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 10 పాలిథిన్ కవర్లలో ఉన్న హాష్​ఆయిల్ తో పాటు రెండు మొబైల్ ఫోన్​లు స్వాధీనం చేసుకున్నారు. 

కేపీహెచ్‌బీలో ఐటీ ఉద్యోగులు అరెస్ట్

అదనపు ఆదాయం కోసం డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఐటీ ఉద్యోగులతో పాటు ఇద్దరు కొనుగోలుదారులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన ఐటీ ఉద్యోగి బెంది సాయిభాను ప్రకాశ్, విజయనగరానికి చెందిన అనూప్ కుమార్ కలిసి బెంగళూరు నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి నగరంలో అమ్ముతున్నారు. ఆదివారం అర్ధరాత్రి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో డ్రగ్స్ కొనేందుకు వచ్చిన డీజే శోభిత్ అలెన్ మణి, ఆర్కిటెక్ట్ రిపుంజయ్ జోథతో కలిసి వీరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 9 ఎల్‌ఎస్‌డీ స్టాంప్స్, 4 గ్రాముల ఎండీఎంఏ, 150 గ్రాముల ఎండు గంజాయి, ఒక బైక్​ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

జన్వాడలో రైల్వే ఉద్యోగి, టెకీ సహా ముగ్గురు అరెస్ట్

గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న రైల్వే ఉద్యోగి, సాఫ్ట్​వేర్ ఇంజనీర్, ఓ వ్యాపారిని మోకిలా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం జన్వాడ ఇంద్రారెడ్డి నగర్ సమీపంలో నిఘా పెట్టిన ఎస్​వోటీ, స్థానిక పోలీసులు.. మిర్జాగూడ వైపు నుంచి వస్తున్న కారును ఆపి తనిఖీ చేశారు. నిందితుల వద్ద 39.72 గ్రాముల కొకైన్, 3 గ్రాముల గంజాయితో పాటు నాలుగు ఐఫోన్లు, కారును సీజ్ చేశారు. విచారణలో సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగి పొనాల సిద్ధార్థ (27) గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి, నిజాంపేటలో ఉంటున్న సాఫ్ట్​వేర్ ఉద్యోగి హిమంత్ కృష్ణ వంశీ (30) ద్వారా నాచారానికి చెందిన వ్యాపారి విష్ణు తేజ (36)కు సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఈ ముఠా హైదరాబాద్​లో డ్రగ్స్ అమ్మడమే కాకుండా పార్టీల్లోనూ వినియోగిస్తున్నట్లు సీఐ వీరాబాబు వెల్లడించారు. 

గోల్కొండలో 4 కిలోల గంజాయి సీజ్

గోల్కొండ పరిధిలో 4.1 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైఫ్ అనే యువకుడు నాగపూర్​కు చెందిన సల్మాన్ ఖాన్ వద్ద కిలో రూ. 10 వేల చొప్పున గంజాయి కొనుగోలు చేసేవాడు. దీనిని చిన్న ప్యాకెట్లుగా చేసి గోల్కొండ ఖాజీ గల్లీలో 10 గ్రాములను రూ. 500 చొప్పున విక్రయిస్తున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు షఫీని సోమవారం అరెస్ట్ చేయగా.. జఫర్ పటేల్, షేక్ అబ్దుల్ ముర్తాజ, అబ్దుల్ రహమాన్, సయ్యద్ ఇర్ఫాన్, మహమ్మద్ మోసిన్, జునైద్, మహమ్మద్ బిన్ అలీలపై కేసులు 
నమోదు చేశారు.

బస్సుల్లోనూ కొనసాగిన తనిఖీలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి డ్రగ్స్ చేరుతున్నాయన్న సమాచారంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు సోమవారం జాతీయ రహదారులపై ముమ్మర తనిఖీలు నిర్వహించారు. సీఐ బాలారాజ్ నేతృత్వంలో మేడ్చల్ జాతీయ రహదారిలోని సుచిత్ర సెంటర్, కొంపల్లి వద్ద ఈ దాడులు జరిగాయి. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్​గఢ్, నాగపూర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 20 ప్రైవేట్ ట్రావెల్ బస్సులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తెలంగాణలోకి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే ఉద్దేశంతో ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.