తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు కురిసాయి. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి చాలా చోట్ల తీవ్ర పంట నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన పంట నేలరాలడంతో లబోదిబోమంటున్నారు రైతులు. మంగళవారం ( మార్చి 31 ) ఉదయం కురిసిన వర్షం కారణంగా జగిత్యాల జిల్లాలో గోడ కూలి కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
జగిత్యాల జిల్లా కోరుట్లలో వర్షం కారణంగా గోడ కూలి రాజేష్ అనే వ్యక్తికి చెందిన డిజైర్ కారు ధ్వంసం అయ్యింది. కోరుట్ల మండలం నాగులపేట గ్రామానికి చెంది న రాజేష్ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో తన కారు పార్క్ చేశాడు. ఉదయం కురిసిన వర్షానికి ఇంటి రెండో అంతస్తుకు సంబంధించిన ప్రహరీ గోడ కూలి కారు మీద పడింది.
రెండో అంతస్తు నుంచి గోడ కూలి పడటంతో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఇష్టపడి కొన్న కారు పూర్తిగా ధ్వంసం అవ్వడంతో లబోదిబోమంటున్నాడు బాధితుడు.
