కౌడిపల్లి, వెలుగు: విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ అకారణంగా కొడుతున్నాడని విద్యార్థులు వాపోయారు. ఈ ఘటన మెదక్ జిల్లా మండల కేంద్రమైన కౌడిపల్లిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్కూల్ లో సోమవారం వెలుగుచూసింది. సోషల్ టీచర్ఉదయ్ కారణం లేకుండా వాతలు వచ్చేలా కొడుతున్నాడని, ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని స్టూడెంట్స్ తెలిపారు.
తమను తిడుతున్న విషయాన్ని పేరెంట్స్ కు చెబితే ఎక్కువ ఇబ్బందికి గురిచేస్తున్నాడని ఆరోపించారు. క్లాస్ చెప్పకుండా చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని టైంపాస్ చేస్తున్నారని విద్యార్థులు వాపోయారు. సిలబస్ కు సంబంధించిన డౌట్లు అడిగితే ‘బూటు అంత లేవు నన్ను డౌట్ అడుగతావా కాలు కింద వేసి తొక్కుతా బిడ్డ’ అని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులకు రావాలసిన కాస్మోటిక్ చార్జీల డబ్బులు అడిగితే ఇష్టం వచ్చినట్లు కొట్టారని, మెనూ ప్రకారం పెట్టాల్సిన మటన్ పెట్టడం లేదని అడిగితే చదువురాని వారికి మటన్ ఎందుకు పెట్టాలని అంటున్నారని ఆరోపించారు. హాస్టల్ లో ఫ్యాన్లు, లైట్ల ఏర్పాటు కోసం తమ వద్దే డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపించారు.
టాయిలెట్లను క్లీన్ చేస్తేనే హాల్ టికెట్లు ఇస్తామన్నారని టెన్త్ స్టూడెంట్స్తెలిపారు. పిల్లలను కొట్టిన విషయం తెలుసుకున్న పేరెంట్స్ స్కూల్ కు వచ్చి సదరు టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రిన్సిపల్ ఫణికుమార్, టీచర్ ఉదయ్ ను వివరణ కోరగా తాము పిల్లలను కొట్టడం లేదని, విద్యార్థుల ఆరోపణలు అవాస్తవమన్నారు. మెనూ ప్రకారం అన్ని వడ్డిస్తున్నామని, వేసవి కాబట్టి మటన్ కు బదులు ఫ్రూట్స్ ఇస్తున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు.
