పాలస్తీనియన్లను ఉరి శిక్షతో చంపుతాం : ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం : నిండుసభలో మందు బాటిళ్లతో సంబరాలు

పాలస్తీనియన్లను ఉరి శిక్షతో చంపుతాం : ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం : నిండుసభలో మందు బాటిళ్లతో సంబరాలు

ఇజ్రాయెల్ ప్రభుత్వం తాజాగా ఆమోదించిన 'మరణశిక్ష చట్టం'పై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. విషయం ఏంటంటే  ఇజ్రాయెల్ పార్లమెంట్ (క్నెసెట్) ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయెలీలను చంపినట్లు రుజువైన పాలస్తీనియన్లకు ఉరిశిక్ష విధిస్తారు. ఈ చట్టంపై మానవ హక్కుల సంఘాలు, పాలస్తీనా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చట్టం రావాలని బలంగా కోరుకున్న ఇజ్రాయెల్  మంత్రి ఇటామర్  బెన్-గ్విర్, పార్లమెంటులో షాంపేన్‌తో సంబరాలు చేసుకున్నారు. "మేము చరిత్ర సృష్టించాం. ఐరోపా దేశాల బెదిరింపులకు మేము భయపడం, లొంగిపోం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రభుత్వం ఇది చాలా "ప్రమాదకరమైన నిర్ణయం" అని మండిపడింది. చట్టం పేరుతో పాలస్తీనియన్లను చంపడానికి ఇజ్రాయెల్ చూస్తోందని ఆరోపించింది. అంతేకాకుండా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న ఖైదీల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని, అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది.

 మానవ హక్కుల సంఘాలు ఈ చట్టం వివక్షతో కూడుకున్నదని  అంటున్నారు. ఎందుకంటే ఇది కేవలం పాలస్తీనియన్లకే వర్తిస్తుంది. చట్టం ముసుగులో ఇజ్రాయెల్ చేస్తున్న హత్యలను ఇది సమర్థిస్తున్నట్లు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరింది. మరణశిక్ష అనేది అమానవీయమని, ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.

  ఐరోపా దేశాలలైన ఐర్లాండ్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్  మరణశిక్షను ఏ సందర్భంలోనూ సమర్థించలేమని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొంది.

ఇటలీ కూడా  శిక్ష పేరుతో ఒకరి ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదని, ఇది వ్యక్తి గౌరవానికి భంగం కలిగించే చర్య అని ఇటలీ విదేశాంగ మంత్రి విమర్శించారు. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు కూడా ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరాయి.

మొత్తానికి, ఇజ్రాయెల్ తీసుకున్న ఈ నిర్ణయం పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఒకవైపు యుద్ధం జరుగుతుండగా, మరోవైపు ఇలాంటి కఠిన చట్టాలు తీసుకురావడం శాంతికి విఘాతమని ప్రపంచ దేశాల అభిప్రాయం.