- ఇది అచ్చమైన ‘పీపుల్స్ బడ్జెట్’.. లక్ష్యం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద కుటుంబం నిరాశకు గురికాకుండా, అందరి సంక్షేమమే ధ్యేయంగా ‘పీపుల్స్ బడ్జెట్’ను రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ప్రస్తుతం 10.7 శాతం వృద్ధి రేటుతో దేశానికే దిక్సూచిగా నిలిచిందని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు భట్టి విక్రమార్క సమాధానమిస్తూ.. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కల్తీ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆహార కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటున్నదని, దీనిని ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుందని స్పష్టం చేశారు. కల్తీ నివారణకు ప్రస్తుతమున్న నిబంధనల కంటే కఠినమైన కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నామని, ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజా ప్రభుత్వం యోచిస్తున్నదని తెలిపారు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉండేలా నిఘా పెంచుతామని చెప్పారు.
నాణ్యమైన ఆహారం అందరికీ అందేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో తనిఖీలను ముమ్మరం చేస్తామని, కల్తీరహిత తెలంగాణను నిర్మిస్తామన్నారు. రూ. 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం రూ. 5,000 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, మూసీ పునర్జీవనం, మెట్రో విస్తరణలాంటి భారీ ప్రాజెక్టులతో రాష్ట్ర రూపురేఖలు మారుస్తామని చెప్పారు. మూసీ పునర్జీవనంతోపాటు చార్మినార్, గోల్కొండ, లాడ్ బజార్‌లాంటి చారిత్రక ప్రాంతాలను టూరిజం హబ్‌లుగా మారుస్తామని భట్టి వెల్లడించారు. నగరంలోని 39 ఎస్టీపీల ద్వారా మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే మూసీలోకి వదిలేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇది పర్యావరణం పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
నీటి ఎద్దడి లేకుండా చేస్తం
అంబర్‌పేట్, నల్గొండ చౌరస్తా లాంటి ప్రాంతాల్లో నీటి నిల్వ సమస్యను పరిష్కరిస్తామని, రాష్ట్రంలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చేయడమే తమ ధ్యేయమని భట్టి విక్రమార్క తెలిపారు. పాతబస్తీలో విద్యుత్ స్తంభాల తొలగింపు, అండర్ గ్రౌండ్ కేబులింగ్‌లాంటి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను నిర్మిస్తున్నామని, ఒక్కో స్కూల్లో 1500 మంది విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 200 కోట్లతో 25 ఎకరాల్లో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మిస్తున్నామని చెప్పారు.
పుస్తకాలు, షూస్‌లాంటివన్నీ ఉచితంగా అందిస్తామని వివరించారు. ఈ ఏడాది కొత్తగా 25 రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమంపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తున్నదని, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం నెలవారీ కేటాయింపులను రూ. 700 కోట్ల నుంచి రూ. వెయ్యి కోట్లకు పెంచనున్నట్టు ప్రకటించారు. మంత్రుల సమయం అత్యంత విలువైనదని, సమయాన్ని ఆదా చేసేందుకే వారు హెలికాప్టర్లను వాడుతున్నారని, ప్రతి నిమిషం రాష్ట్ర అభివృద్ధి కోసమే వెచ్చిస్తున్నారన్నారు.
