భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్వామివారి తెప్పోత్సవం కనుల పండువగా సాగింది. ఉదయం యాగశాలలో చతుస్థానార్చన, హోమం జరిపించారు. ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి వేదపారాయణం చేశారు. సాయంత్రం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి మంగళవాయిద్యాలు, కోలాటాలు, వేదమంత్రోచ్ఛరణల, భక్తుల రామనామస్మరణల నడుమ ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకెళ్లారు.
అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన పడవపై స్వామిని అధిష్టించి నదీ విహారం చేశారు. ముందుగా పడవకు పూజలు చేశారు. అనంతరం సీతారామచంద్రస్వామిని అశ్వవాహనంపై ఊరేగింపుగా తీసుకొస్తూ దొంగలదోపు (చోరోత్సవం)ఉత్సవాన్ని జరిపారు.
