వెంకన్న ఉచిత దర్శనాలపై స్పందించిన టీటీడీ చైర్మన్

వెంకన్న ఉచిత దర్శనాలపై స్పందించిన టీటీడీ చైర్మన్
  • గో ఆధారిత సంప్రదాయ భోజనంపై వెనకడుగు

తిరుమలలో గో ఆధారిత సంప్రదాయ భోజనంపై టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) వెనకడుగేసింది. రసాయన ఎరువులు వాడకుండా, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలతో 14 రకాల వంటలు తిరుమల వచ్చే భక్తులకు వడ్డించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. అయితే దీనికి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయాలని అనుకోవడంపై అంతటా విమర్శలు వచ్చాయి. ఈ ఇష్యూపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ (సోమవారం) మీడియాతో మాట్లాడారు.  సంప్రదాయ భోజన విధానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. పాలకమండలి పదవీ కాలం ముగిసిన సమయంలో అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని, అయితే దానిపై తాను చర్చించి నిర్ణయం ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు. తిరుమల కొండపై భక్తులకు స్వామివారి ప్రసాదంగానే భోజనం అందించాలని, అన్నప్రసాదానికి డబ్బులు తీసుకోకూడదని అధికారులకు సూచించామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కృష్ణాష్టమి సందర్భంగా తిరుమలేశుడికి నవనీత సేవ కార్యక్రమాన్ని ఇవాల్టి నుంచి ప్రారంభిస్తున్నామన్నారు.

అయితే ఈ సందర్భంగా ఆయనను మీడియా ప్రతినిధులు సర్వ దర్శనం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్వ దర్శనాలపై (ఉచిత దర్శనాలు) ఇంకా నిర్ణయం తీసుకోలేదని వైవీ సుబ్బారెడ్డి సమాధానమిచ్చారు. అయితే తాను ఇటీవలే రెండో సారి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే ఉచిత దర్శనాలు ప్రారంభించాల్సిందిగా అధికారులను ఆదేశించానని చెప్పారు. అయితే దీనిపై చిత్తూరు జిల్లా కలెక్టర్, హెల్త్ అధికారులతో చర్చించి, వీలైనంత త్వరగా ఎంతో కొంత మందికి కొద్ది సంఖ్యలోనైనా ఉచిత దర్శనాలు కల్పించేలా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.