- టీటీడీ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు చెప్పులను వదిలేందుకు ప్రత్యేక కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. గతంలో చెప్పులు వదిలే చోట భక్తులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, లగేజీ కౌంటర్ల తరహాలోనే క్యూఆర్ కోడ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇటీవల టీటీడీ బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో చెప్పులు వదిలే దగ్గర భక్తులు తమ చెప్పులను వెతుక్కోవడం పెద్ద సమస్యగా ఉండేది. ఇప్పుడు ఆ విధానాన్ని మార్చి, డిజిటలైజ్డ్ టోకెన్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు. భక్తులు కౌంటర్‌లో చెప్పులు ఇచ్చినప్పుడు, వారికి మొబైల్ నంబర్ లేదా క్యూఆర్ కోడ్ ఉన్న రసీదు/టోకెన్‌ను ఇస్తారు. తర్వాత చెప్పులను ప్రత్యేకమైన సంచి లేదా బాక్స్‌లో భద్రపరుస్తారు.
దీని వల్ల చెప్పులు పోయే అవకాశం ఉండదు. దర్శనం ముగించుకుని వచ్చిన తర్వాత ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే, మీ చెప్పులు ఏ రాక్‌లో ఉన్నాయో సిబ్బందికి తెలిసిపోతుంది. లగేజీ కౌంటర్ల లాగే ఈ చెప్పుల కౌంటర్లు కూడా భక్తులకు ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశ మార్గాల వద్ద, పీఏసీ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. ఒకవేళ టోకెన్ పోగొట్టుకున్నా, మొబైల్ నంబర్ ఆధారంగా చెప్పుల ఉంచిన రాక్‌ను తెలుసుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు.
