శ్రీవాణి టికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఆన్‌లైన్ బుకింగ్ లో అక్రమాలను అరికట్టేందుకు ఇకపై లక్కీడిప్ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు టీటీడీ ఈవో రవిచంద్ర. ఈ కోటాలో రోజుకు 1,500 మందికి శ్రీవాణి టికెట్లు జారీ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి ప్రధాన విమానాశ్రయాల నుంచి కూడా శ్రీవాణి కోట టికెట్లు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. గతంలో విరాళాలు ఇచ్చి దర్శనం చేసుకోని 41వేల మంది భక్తులు జూన్ మొదటివారం నుంచి రోజుకు 300 టికెట్ల చొప్పున కేటాయించి రానున్న 5-10 నెలల్లో బ్యాక్ లాగ్ పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
సాధారణ భక్తులు శ్రీవారి దర్శనానికి వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు వీలుగా వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్య భారీగా తగ్గించనున్నామని అన్నారు ఈవో రవిచంద్ర. ఈ నిర్ణయంతో సాధారణ రోజుల్లో సామాన్యులకు త్వరగా స్వామివారి దర్శనం లభిస్తుందని అన్నారు. మూడు రోజుల్లో 2.5 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించామని అన్నారు.
అంతే కాకుండా పాలనాపరమైన సంస్కరణలకు టీటీడీ ఆస్తుల పరిరక్షణ కోసం తగిన చర్యలు చేపట్టనున్నామని.. ఒకే స్థానంలో ఏళ్ళ తరబడి పనిచేస్తున్న సిబ్బంది వల్ల తలెత్తుతున్న సమస్యలను నివారించేందుకు కొత్త ట్రాన్స్ఫర్ పాలసీ రూపొందించామని అన్నారు.
