V6 News

ప్రకటనలకే పరిమితమా?..మద్ధతు ధరకు కొనాలని కేంద్రానికి తుమ్మల లెటర్

ప్రకటనలకే పరిమితమా?..మద్ధతు ధరకు కొనాలని కేంద్రానికి తుమ్మల లెటర్

హైదరాబాద్​, వెలుగు: రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. కేంద్ర సర్కారు మద్ధతు ధరలు ప్రకటించడానికే పరిమితమై, వాస్తవ కొనుగోళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. సోయాబీన్, శనగ, వేరుశనగ, పెసలు, పొద్దుతిరుగుడు వంటి పంటల కొనుగోళ్లపై 25 శాతం పరిమితులు విధించడం రైతుల పట్ల కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందన్నారు.

దీంతో మిగిలిన దిగుబడిని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. మొక్కజొన్న విషయంలోనూ కేంద్రం కొనుగోళ్లకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. రైతుల నష్టాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపడుతోందన్నారు. ఇప్పటికే 200కు పైగా కేంద్రాల ద్వారా 1.20 లక్షల టన్నుల మొక్కజొన్నను మద్ధతు ధరకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. మొక్కజొన్నను నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న పరిమితులను ఎత్తివేయాలని మంత్రి తుమ్మల లెటర్​ ద్వారా మరోమారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.