అన్ని వర్గాల వాళ్లు మార్పుకోరుకుంటున్నారు : తుమ్మల

అన్ని వర్గాల వాళ్లు మార్పుకోరుకుంటున్నారు : తుమ్మల

కర్నాటక ఎన్నికల ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో కూడా పడిందన్నారు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. ఎల్బీనగర్ లో మధుయాష్కీ పోటీకి ముందుకు రావడం ఇక్కడి ప్రజల అదృష్టం అని అన్నారు. రాహుల్ గాంధీకి అతి సన్నిహితుల్లో మధుయాష్కీ గౌడ్ కూడా ఒకరని చెప్పారు. హైదరాబాద్ మినీ ఇండియా.. ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు. డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. ఎల్బీనగర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మధుయాష్కీని గెలిపించే బాధ్యత ఇక్కడి ప్రజలందరిపైనా ఉందన్నారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీకి మద్దతుగా తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. 

నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రజల జీవితాలను నిలబెట్టే ఎన్నికలు అని చెప్పారు. అన్ని వర్గాల వాళ్లు రాష్ట్రంలో మార్పు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజాపాలన కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ధరణి పేరు మీద జరిగే మోసాలు హైదరాబాద్ ప్రజలకు బాగా తెలుసన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు చూడలేకనే తాను ఎన్నిక బరిలో నిలిచానని చెప్పారు. ప్రజా సంపద మొత్తాన్ని బీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. దేశం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ప్రధాని కాకుండా.. ప్రజలకోసం పని చేస్తున్నారని చెప్పారు. దేశానికి ప్రాణాలర్పించిన కుటుంబం.. రాహుల్ గాంధీ కుటుంబం అని చెప్పారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు మీద పెట్టిన కేసుల మీద ఎలాంటి ఆధారాలు లేవన్నారు తుమ్మల. చంద్రబాబు జాతీయ నాయకుడు.. అతి కీలకమైన వ్యక్తి అని చెప్పారు. కేంద్రంలో అనేక అవకాశాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి మాత్రమే కోరుకున్న వ్యక్తి చంద్రబాబు అని కామెంట్స్ చేశారు.