ఆ యాడ్స్​ ఆపండి.. ఛానళ్ల ఎడిటర్లకు అడిషనల్​ సీఈవో ఆదేశాలు

ఆ యాడ్స్​ ఆపండి..  ఛానళ్ల ఎడిటర్లకు అడిషనల్​ సీఈవో ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర స్థాయి మీడియా సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటలన్నింటినీ వెంటనే నిలిపివేయాలని అన్ని టీవీ, సోషల్​ మీడియా చానళ్లను అడిషనల్​ సీఈవో లోకేశ్​ కుమార్​ ఆదేశించారు. ఈ మేరకు మీడియా సర్టిఫికేషన్​ అండ్​ మానిటరింగ్​ కమిటీ తరఫున అన్ని ఛానళ్ల ఎడిటర్లకు లెటర్లు రాశారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు15 వీడియోలను ప్రసారం చేయకుండా వెంటనే ఆపాలని అందులో స్పష్టం చేశారు. అసెంబ్లీ సాధారణ ఎన్నికల కోసం స్టేట్ లెవెల్ మీడియా సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలు దుర్వినియోగం అవుతున్నాయని పేర్కొన్నారు. 

అభ్యంతరకరంగా ఉన్న వాటి వివరాలను లెటర్​తో జతచేసి పంపారు. ఇందులో ఎక్కువగా కాంగ్రెస్​ పార్టీకి చెందినవే ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్​ పార్టీ అధికార బీఆర్ఎస్​ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కొన్ని వీడియోలు చేసింది. వాటికి మీడియా సర్టిఫికేషన్ ​కూడా తీసుకున్నారు. వాటి వల్ల బీఆర్ఎస్​కు చాలా డ్యామేజ్​అవుతుందని గుర్తించారు. వీటిపై బీఆర్ఎస్ నుంచి సీఈఓ వికాస్​రాజ్​కు ఫిర్యాదు అందింది. కాగా, బీఆర్ఎస్​ ఇచ్చిన కొన్ని పొలిటికల్​ యాడ్స్​ను కూడా నిలిపేయాలని చెప్పినట్లు తెలిసింది. 

పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేసేందుకు పేపర్ ​యాడ్స్, సోషల్​ మీడియా, ఛానళ్ల వీడియోలు, క్లిప్పింగ్​లకు ఎంసీఎంసీ ఆమోదం తప్పనిసరి..  అయితే, ఆమోదం పొందిన తర్వాత ఇప్పుడు సడన్​గా సీఈవో ఆఫీస్​ నుంచి కొన్ని వీడియోలను తొలగించాలని ఆదేశాలు రావడానికి ఇంకేదో బలమైన కారణం ఉండి ఉందని చర్చ జరుగుతోంది.