చెన్నై: తమిళనాడులో టీవీకే విజయంలో ఆ పార్టీ ఇచ్చిన ఎన్నికలు హామీలు ప్రధాన పాత్ర పోషించాయి. ఆ పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని విజయ్ ప్రకటించిన ‘బంగారం’ హామీ హాట్ టాపిక్‌గా మారింది. పేద వధువులకు వివాహ సమయంలో 8 గ్రాముల బంగారంతో పాటు నాణ్యమైన పట్టుచీరను అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం గ్రాము బంగారం సుమారు 14 వేల రూపాయల (22 క్యారెట్లు) వరకు పలుకుతున్న తరుణంలో ఈ పథకం మహిళల్లో పెద్ద ఎత్తున ఆకర్షణగా నిలిచింది. దీనికి అదనంగా, 60 ఏండ్లలోపు మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, ఏడాదికి ఆరు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని ఆయన వాగ్దానం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించి మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు.
విద్యారంగంలో సమూల మార్పులు..
విద్యారంగంలో సమూల మార్పుల కోసం విజయ్ వినూత్న ప్రణాళికలను మేనిఫెస్టోలో చేర్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లులకు ఏడాదికి 15 వేల రూపాయల ప్రోత్సాహకం అందించడం ద్వారా పాఠశాలల డ్రాపౌట్లను అరికడతామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, మాజీ సీఎం కామరాజ్ పేరుతో 100 ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు, ఉన్నత చదువుల కోసం 20 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తామని తెలిపారు. ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకంగా ఏఐ మంత్రిత్వ శాఖ, ఏఐ వర్సిటీలాంటి విప్లవాత్మక హామీలను ప్రజల ముందు ఉంచారు. రైతు సంక్షేమం కోసం ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు సహకార రుణాల పూర్తి మాఫీ, క్వింటాలు వరికి 3,500 రూపాయల మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు నెలకు రూ. 4వేల భృతిని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పెన్షన్ విధానాన్ని పరిశీలిస్తామని, కాంట్రాక్ట్ కార్మికులను (నర్స్ లతోసహా) క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి పైపుల ద్వారా 100% తాగునీరు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని వాగ్దానం చేశారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మారుస్తామని, రూ. 25 లక్షల వరకు ఉచిత కుటుంబ ఆరోగ్య బీమా కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. పరిపాలనలో పారదర్శకత కోసం రేషన్ సరుకులతో సహా అన్ని ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటికే చేరవేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, అవినీతి రహిత పాలనను అందిస్తామని పేర్కొన్నారు. ఈ ఆకర్షణీయ హామీలే విజయ్‌ను విజయతీరాలకు చేర్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
