గిరిజన మహిళ మృతి కేసులో అనుమానాలెన్నో..

గిరిజన మహిళ మృతి కేసులో అనుమానాలెన్నో..
  • అత్యాచారం చేసి చంపారంటున్న కుటుంబీకులు
  • యాక్సిడెంట్​లోనే చనిపోయిందంటున్న పోలీసులు 
  • ఇయ్యాల పూర్తి వివరాలు వెల్లడి 

ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో జరిగిన గిరిజన మహిళ బానోత్ నీల (45) మృతి కేసు మలుపులు తిరుగుతోంది. బాధితురాలిని కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్ అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు చెబుతుండగా, పోలీసులు అదేం లేదంటున్నారు. ఆమె యాక్సిడెంట్ లోనే చనిపోయిందని, పూర్తి వివరాలు గురువారం వెల్లడిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో నీల డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా, అంత్యక్రియల కోసం సొంతూరుకు తరలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో మీడియా సిబ్బందికి, వన్ టౌన్ పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మృతదేహాన్ని వీడియో తీస్తున్న సమయంలో పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని మీడియా సిబ్బంది ఆందోళనకు దిగారు. కెమెరాలను లాక్కోవడంతో వన్​టౌన్​సీఐ స్వామిపై ఏసీపీకి, అడిషనల్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్లు సర్దిచెప్పి కెమెరాలను తిరిగి అప్పగించారు. 

ఏంటీ కేసు? 

కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చెన్నారావుపేట రామన్నగుట్ట తండాకు చెందిన బానోత్ నీల(45).. తన అత్త మల్లిని ఆస్పత్రిలో చూపించేందుకు పోయిన నెల 27న ఖమ్మం తీసుకొచ్చింది. రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుంచి ఆటోలో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చూ పించుకొని అదే రోజు రాత్రి ఆటోలో బస్టాండ్ కు బయలుదేరారు. అయితే మధ్యలో ఆటో ఆపి మల్లి బహి ర్భూమికి వెళ్లగా, ఆటో డ్రైవర్ నీలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. మరుసటి రోజు తీవ్ర గాయాలైన నీలను గుర్తు తెలియని వ్యక్తి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి వెళ్లాడు. రెండ్రోజుల తర్వాత ఊరికి చేరుకున్న మల్లి.. కుటుంబసభ్యులకు జరిగిందంతా చెప్పింది. వాళ్లు ఖమ్మం టౌన్​కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చివరకు మూడ్రోజులకు మార్చురీలో నీల డెడ్ బాడీని గుర్తించారు..

ఎన్నో ప్రశ్నలు... 

నీలపై రేప్​ జరగలేదని, ఆమెది హత్య కాదని పోలీసు లు చెబుతున్నారు. అందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ కూడా స్వాధీనం చేసుకున్నామని అంటున్నారు. మరి యాక్సిడెంట్ అయితే 27న కనిపించకుండా పోయిన నీల.. మరుసటి రోజు ఆస్పత్రిలో చేరే వరకు ఎక్కడుందనేది ప్రశ్నార్థకంగా మారింది. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? నీల మాత్రమే గాయపడిందా? ఆటో డ్రైవర్ ఏమయ్యాడు? యాక్సిడెంట్ అయితే గుర్తు తెలియని వ్యక్తి నీలను మాత్రమే ఆస్పత్రిలో చేర్పించి ఎందుకు పారిపోయాడు? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటికీ గురువారం పోలీసుల ప్రెస్ మీట్ తర్వాతే క్లారిటీ రానుంది. మరోవైపు గత నెల 27న ఖమ్మం రైల్వే స్టేషన్​లో ఫుటేజీని పరిశీలించగా.. అసలు అత్త, కోడలు రైలులో వచ్చినట్టు ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు. ఇక నీలను ఆస్పత్రిలో ఎవరు చేర్పించారనేది తెలుసుకునేందుకు అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించగా, అవి పని చేయడం లేదని తెలిసిందన్నారు.