ట్విట్టర్ పై కేంద్రం చర్యలు తీసుకోవచ్చు

ట్విట్టర్ పై కేంద్రం చర్యలు తీసుకోవచ్చు

కొత్త ఐటీ చట్టం అమలుపై ట్విట్టర్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యల పరిష్కార అధికారి (గ్రీవెన్స్ ఆఫీసర్) నియామకం చేపట్టకుండా.. చట్ట నిబంధనల అమలు ప్రక్రియ ఇంకా నడుస్తోందని ట్విట్టర్ సమాధానమివ్వడంపై అసహనం వ్యక్తం చేసింది. కొత్త ఐటీ చట్టాన్ని ట్విట్టర్ అమలు చేయట్లేదంటూ అమిత్ ఆచార్య అనే లాయర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు ట్విట్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

అయితే ట్విట్టర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ సాజన్ పూవయ్య.. గ్రీవెన్స్ ఆఫీసర్ నియామకానికి మరో రెండు వారాలు గడువు కావాలని కోర్టును కోరారు. జూన్ 21నే ధర్మేంద్ర చాతుర్ రాజీనామా చేశారని, అప్పటి నుంచి భారత్ లోనే ఉండే గ్రీవెన్స్ ఆఫీసర్ ను ఎందుకు నియమించలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. రాజీనామా చేసిన చాతుర్.. అసలు తాత్కాలిక అధికారి అని ముందే ఎందుకు చెప్పలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును ట్విట్టర్ తప్పుదోవ పట్టించిందంది. 

గ్రీవెన్స్ ఆఫీసర్ ను ఎప్పుడు నియమిస్తారో, ఐటీ చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తారో పక్కా సమాచారం ఇవ్వాలని, అందుకు ఒక్కరోజు గడువు ఇస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. గురువారం లోగా ఏ విషయాన్నీ చెప్పాలని ఆదేశించింది.