కేటీఆర్, షర్మిల అభిమానుల మధ్య ట్విట్టర్ వార్

కేటీఆర్, షర్మిల అభిమానుల మధ్య ట్విట్టర్ వార్

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. కేటీఆర్ పుట్టినరోజున షర్మిల విషెష్ చెప్తూ చేసిన ట్విట్ వివాదంగా మారింది. షర్మిల నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేటీఆర్ ఎవరు కేసీఆర్ కొడుకా అంటూ వెటకారంగా జవాబిచ్చినప్పటి నుంచే.. షర్మిలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు కేటీఆర్ అభిమానులు. ఇప్పుడు కేటీఆర్ బర్త్ డే రోజు చేసిన ట్వీట్ తో మళ్లీ టార్గెట్ చేసారు. పనిలోపనిగా  నిరుద్యోగ సమస్యను ఆ ట్వీట్ లో ప్రస్తావించారు.  తెలంగాణలో నిరుద్యోగ సమస్యని తీర్చేలా ఆ భగవంతుడు కేటీఆర్ కు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ ట్వీట్ చేశారు షర్మిల.  

షర్మిల వెటకారాన్ని చాలామంది టీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్ అభిమానులు సీరియస్ గా తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెను వ్యక్తిగతంగా దూషించటం, కౌంటర్లివ్వటం మొదలుపెట్టారు. మరీ అంత వ్యంగ్యం ఎందుకనుకున్నారో ఏమో కానీ ఆమె తన ట్వీట్ ను డిలీట్ చేశారు. దీంతో కేటీఆర్ అభిమానులు.. షర్మిలపై మరింత ట్రోలింగ్ దాడిని పెంచారు. పులివెందుల ఆడపులి భయపడిందంటూ.. ట్రోలింగ్ ను ఎదుర్కునే ధైర్యం లేనప్పుడు ట్వీట్ చేయటం ఎందుకంటూ.. షర్మిలను రెచ్చగొట్టేలా ట్వీట్లు చేయటం మొదలుపెట్టారు. 

కేటీఆర్ ట్విట్టర్ సైన్యానికి భయపడేదాన్ని కాదంటూ తాను డిలీట్ చేసిన ట్వీట్.. స్క్రీన్ షాట్ ను మళ్లీ పోస్ట్ చేశారు షర్మిల. ట్వీట్ల దాడితో అలర్టయిన షర్మిల టీమ్.. కేటీఆర్ టీమ్ కు కౌంటర్ గా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా.. ట్వీట్స్ చేయటం మొదలుపెట్టారు. దీంతో రెండువర్గాల మధ్య ట్విట్టర్ లో ఫైట్ జోరుగా నడుస్తోంది. దమ్ముంటే షర్మిల లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాలని, అంతేకాని వ్యక్తిగతంగా దాడిచేయడం తెలంగాణ సంస్కృతి కాదంటూ కేటీఆర్ అభిమానులను నిలదీస్తున్నారు షర్మిల టీమ్ సభ్యులు. ట్రోలింగ్ నడిస్తే నడిచింది కానీ.. నిరుద్యోగ సమస్యను జనాల్లోకి తీసుకెళ్లగలిగామనే ఆలోచనలో షర్మిల టీం ఉంది.