రాష్ట్రంలో లేబర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అమలు చేయొద్దు : టీడబ్ల్యూజేఎఫ్

రాష్ట్రంలో లేబర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అమలు చేయొద్దు : టీడబ్ల్యూజేఎఫ్
  • కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి, జర్నలిస్టుల హక్కులు కాపాడండి 
  • మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామికి టీడబ్ల్యూజేఎఫ్ వినతి

హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించేలా, దశాబ్దాలుగా అమల్లో ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు ‘లేబర్ కోడ్’లను రాష్ట్రంలో అమలు చేయొద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ కోరింది. ఈ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం చేయాలని కోరింది. 

ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామిని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం త్రైపాక్షిక కమిటీని నియమించాలని యూనియన్ నేతలు కోరారు. ఈ కమిటీలో హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూజేకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. అలాగే, గత కొంతకాలంగా నిలిచిపోయిన జర్నలిస్ట్ యాక్సిడెంట్ పాలసీని (ప్రమాద బీమా) వెంటనే పునరుద్ధరించాలని, కనీస వేతనాల జీవోను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించాలన్నారు.

 మీడియా రంగంలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుల రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రాత్రి వేళల్లో విధులు ముగించుకుని వెళ్లే మహిళా జర్నలిస్టులకు ఆఫీసుల నుంచి సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి విన్నవించారు. 

అధికారులతో చర్చిస్తా: మంత్రి వివేక్

టీడబ్ల్యూజేఎఫ్ లేవనెత్తిన అంశాలపై మంత్రి వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించారు. కార్మిక శాఖ పరిధిలో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. త్వరలోనే అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, సాధ్యమైనంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు రాజశేఖర్, గుడిగ రఘు, రాధిక, స్టేట్ ఈసీ మెంబర్లు మణిమాల, మేకల కృష్ణ పాల్గొన్నారు.