సర్కారు డాక్టర్లకు రెండు బ్యాచ్‌‌‌‌లుగా డ్యూటీలు

సర్కారు డాక్టర్లకు రెండు బ్యాచ్‌‌‌‌లుగా డ్యూటీలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగుడాక్టర్లపై కరోనా పంజా విసురుతుండటంతో వైద్యారోగ్య శాఖ అలర్టయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ టీచింగ్, సూపర్‌‌‌‌ ‌‌‌‌స్పెషాలిటీ దవాఖాన్లలో డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని రెండు గ్రూపులుగా విభజించి డ్యూటీలు వేయాలని నిర్ణయించింది. ఓ బ్యాచ్‌‌‌‌ డ్యూటీలో ఉంటే మరో బ్యాచ్ రెస్ట్‌‌‌‌ తీసుకునేలా డ్యూటీలు వేయాలని హాస్పిటల్‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌లకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌, డాక్టర్‌‌‌‌ రమేశ్‌‌‌‌రెడ్డి గురువారం ఉత్తర్వులిచ్చారు. తొలి బ్యాచ్‌‌‌‌ డ్యూటీ చేస్తున్న వారం రోజులు రెండో బ్యాచ్‌‌‌‌ హోం క్వారంటైన్‌‌‌‌లో ఉంటారని చెప్పారు. డ్యూటీ చేస్తున్న వాళ్లలో ఎవరికైనా వైరస్ సోకితే రెండో బ్యాచ్‌‌‌‌లోని మరొకరితో డ్యూటీ చేయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రొటేషన్‌‌‌‌ పద్ధతిలో డ్యూటీలేస్తే ఒకేసారి ఎక్కువ మంది వైద్య సిబ్బందికి వైరస్ రాకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరూ పీపీఈలు, మాస్క్‌‌‌‌లు ధరించాలని డీఎంఈ సూచించారు. అవసరమైన మేర మాస్కులు, పీపీఈలు స్టాక్ ఉండేలా చూసుకోవాలని, ఈ బాధ్యతలను సీనియర్ ఆర్‌‌‌‌‌‌‌‌ఎంవోలకు అప్పగించాలని చెప్పారు. వైరస్ కేసులు పెరుగుతున్నందున డాక్టర్లు, వైద్య సిబ్బందికి సెలవులు ఇవ్వొద్దని సూపరింటెండెంట్‌‌‌‌లను ఆదేశించారు.

టెస్టులకు అనుమతించలె

పేట్లబురుజు మెటర్నిటీ హాస్పిటల్‌‌‌‌లో పని చేస్తున్న జూనియర్ డాక్టర్లకు వైరస్ లక్షణాలున్నా టెస్టులకు ఆ హాస్పిటల్‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌ తొలుత పర్మిషన్ ఇవ్వలేదని జూనియర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్లు ఆరోపించారు. అందుకే ఒకరి నుంచి మరొకరికి వైరస్‌‌‌‌ వ్యాపించిందన్నారు. పేట్లబురుజులో పనిచేసిన 18 మంది డాక్టర్లకు వైరస్ సోకిన విషయంపై పలువురు జూడాలు గురువారం సోషల్‌‌‌‌ మీడియాలో పోస్టులు పెట్టారు. నిమ్స్‌‌‌‌లో గురువారం మరో ఐదుగురు డాక్టర్లకు వైరస్ సోకింది. ఇందులో నలుగురు కార్డియాలజీ పీజీలు, ఓ ప్రొఫెసర్ ఉన్నారు. దీంతో అందరికీ టెస్టులు చేయించాలని డాక్టర్లు కోరుతున్నారు. ఇదే విషయమై నిమ్స్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ను జూడాలు కలిసి అనుమతి కోరారు. డాక్టర్లకు కరోనా సోకడంతో కార్డియాలజీకి సంబంధించి ఎమర్జెన్సీ తప్ప మిగిలిన ఆపరేషన్లు వాయిదా వేయాలని డాక్టర్లు నిర్ణయించారు.

డాక్టర్లు భయపడుతున్నరు

కరోనా బారిన పడుతున్న డాక్టర్లు పెరుగుతుండటంతో మిగతా డాక్టర్లలో భయం పెరుగుతోంది. హైదరాబాద్‌‌‌‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌‌‌‌, పేట్లబురుజు ఆస్పత్రుల్లోని డాక్టర్లు, సిబ్బంది కలిపి 30 మందికి పైగా కరోనా సోకడంతో మిగిలిన వాళ్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పని చేస్తున్నారు. పీపీఈ కిట్లు, మాస్కులు పెట్టుకొని డ్యూటీ చేస్తున్నారు. పేషెంట్లు సోషల్ డిస్టెన్స్ పాటించేలా, మాస్కులు పెట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. 30 మందికి పైగా వైరస్‌‌‌‌ బారిన పడటం, 200 మంది డాక్టర్లు క్వారంటైన్‌‌‌‌కు వెళ్లడంతో ఆస్పత్రుల్లో ఓపీలపై ఎఫెక్ట్‌‌‌‌ పడింది. లాక్‌‌‌‌డౌన్ తరువాత నిమ్స్ ఓపీకి రోజూ వేయి మందికి పైగా రోగులు వచ్చేవారు. గురువారం 798 మంది వచ్చారు. కార్డియాలజీ విభాగంలో 20 మందికే డాక్టర్లు చెకప్‌‌‌‌  చేశారు. ఈ విభాగంలోని డాక్టర్లకూ కరోనా సోకడంతో రోగులు భయపడుతున్నారని, అందుకే రావట్లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఓపీ విభాగాలకు వస్తున్న రోగుల్లో కరోనా అనుమానితులుంటే గాంధీకి పంపుతున్నారు. గురువారం ఇలా ఆరుగురిని గాంధీకి తరలించారు. ఉస్మానియాలో ఓపీల్లో పని చేసే వాళ్లలో వంద మందికి పైగా డాక్టర్లు క్వారంటైన్ అవడంతో వైద్య సేవలు స్లోగా అందాయి. ఆస్పత్రికి రోగుల సంఖ్య మాత్రం తగ్గలేదు.

పీపీఈ కిట్లు ఇస్తే డాక్టర్లకు కరోనా ఎట్లొచ్చింది.?