నిర్మల్ లో విషాదం..నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

నిర్మల్ లో విషాదం..నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని విట్టోలి గ్రామంలో విషాదం నెలకొంది. వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు.

విట్టోలి గ్రామంలోని తన బంధువు కొండేకర్ బాలాజీ ఇంటికి ఇద్దరు బాలురు అతిథులుగా వచ్చారు. వీరిలో ఒకరు తానూర్ మండలం కలూర్ గ్రామానికి చెందిన నికిల్ (15 ) కాగా..మరొకరు మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన స్వరాజ్ (14 ). మే 11 న మధ్యాహ్నం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న రంగారి కుంట చెరువు వద్ద ఆడుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న లోతైన నీటి కుంటలో ప్రమాదవశాత్తు జారి పడ్డారు. ఈత రాకపోవడంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.

కళ్లముందే ఆడుకుంటూ కనిపించిన పిల్లలు శవాలై తేలడంతో విట్టోలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ బిడ్డల మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.