24గంటల్లో 18 మంది రోగుల మృతి ఘటన..ఇద్దరు డాక్టర్లపై వేటు

24గంటల్లో 18 మంది రోగుల మృతి ఘటన..ఇద్దరు డాక్టర్లపై వేటు

2023, ఆగస్టు నెలలో ఒకే ఆస్పత్రిలో ఒకే రోజు 18 మంది రోగులు చనిపోయిన సంఘటన గుర్తుందా..? ఇప్పుడా ఆస్పత్రి మరోసారి వార్తలోకెక్కింది. సదరు ఆస్పత్రిలో పని చేసే ఇద్దరు డాక్టర్లపై వేటు పడింది. అంతేకాదు.. మరికొంతమంది సిబ్బందికి కూడా షోకాజ్‌ నోటీసులు అందాయని తెలుస్తోంది. 

మహారాష్ట్ర థానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లోనే 18 మంది రోగులు మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సొంత నియోజకవర్గమైన థానేలో ఈ ఘటన ఆగస్టు 12, 13 తేదీల్లో తీవ్ర దుమారం రేపింది. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. 

ఆస్పత్రిలో 18 మంది చనిపోవడానికి కారణాలు తెలుసుకునేందుకు సీఎం షిండే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆ కమిటీ... నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ ఘటనపై నాలుగు నెలల తర్వాత థానే అధికార యంత్రాంగం చర్యలు  చేపట్టింది. 

ఈ వ్యవహారంలో ఇద్దరు వైద్యులను సస్పెండ్‌ చేసింది. ఈ ఘటనలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసిస్టెంట్‌ డాక్టర్‌, అసోసియేట్‌ డాక్టర్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ ఘటనలో పలువురు వైద్యులు, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బందికి సైతం షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.