నిర్మల్, వెలుగు : ఇద్దరు యువకులు కలిసి బాలికలను ఇంటి నుంచి ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... నిర్మల్‌కు చెందిన అబ్బాస్‌ఖాన్, షేక్ ఖలీమ్ అనే వ్యక్తులు శనివారం రాత్రి సోఫినగర్ కాలనీకి చెందిన ఇద్దరు బాలికలను ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు.
ఇద్దరినీ పోచంపాడ్ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఓ బాలిక వారి నుంచి తప్పించుకొని కాలనీవాసులకు సమాచారమిచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అడిషనల్ ఎస్పీ సాయికిరణ్ పోలీస్ బృందాలను రంగంలోకి దింపి నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలో పోచంపాడ్ ప్రాంతంలోనే గంజాయి మత్తులో ఉన్న అబ్బాస్‌ఖాన్, షేక్ ఖలీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులిద్దరిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బాధిత బాలికలను సఖి కేంద్రానికి తరలించారు. బాలికలపై లైంగికదాడికి పాల్పడ్డ వ్యక్తులను కఠినంగా శిక్షించాలని సోఫీనగర్ కాలనీవాసులు డిమాండ్ చేశారు.
స్టూడెంట్‌పై లైంగిక దాడి కేసులో ఏడుగురు అరెస్ట్
నారాయణపేట/మద్దూరు, వెలుగు : నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోమినాపూర్ జడ్పీహెచ్‌ఎస్‌లో టెన్త్ స్టూడెంట్‌పై లైంగిక దాడి కేసులో ఇద్దరు సర్కార్ టీచర్లతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వినీత్ ఆదివారం వెల్లడించారు.
మోమినాపూర్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న చండేపల్లి స్వామి టెన్త్ చదువుతున్న ఓ స్టూడెంట్‌పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే స్కూల్‌లో పనిచేస్తున్న మరో టీచర్ గుర్నాథ్‌రెడ్డి కంప్యూటర్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో లైంగిక దాడి దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియోలను గుర్నాథ్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన కర్ని చెన్నకేశవులు, గూళ్ల రవికుమార్, బి.ఆనంద్, కొత్తపల్లి మండలం నిడ్జింత గ్రామానికి చెందిన విజయ్ కుమార్, మేకల రవికి షేర్ చేశాడు.
వీరంతా కలిసి స్వామిని డబ్బుల కోసం బెదిరించారు. ఈ క్రమంలోనే విషయం బయటకు పొక్కడంతో టీచర్లు స్వామి, గుర్నాథ్‌రెడ్డితో పాటు మిగతా ఐదుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద ఉన్న సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని, వారిపై పోక్సో, ఐటీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
