న్యూఢిల్లీ: ఇండియా స్టార్ బాక్సర్, ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ ఎంసీ మేరీ కోమ్.. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టాలని యోచిస్తోంది. ‘ఆరు వరల్డ్ చాంపియన్‌షిప్‌లు గెలవడం మర్చిపోలేని అనుభూతి. వయో పరిమితుల వల్ల దేశం తరఫున అమెచ్యూర్ బాక్సింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు. కానీ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో ఆడే సత్తా ఉందని భావిస్తున్నా. ప్రస్తుతం ఈ దిశగా ఆలోచన చేస్తున్నా. రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వస్తుంది’ అని మేరీ కోమ్ వెల్లడించింది.
ప్రస్తుతం మణిపూర్‌లోని తన అకాడమీ ద్వారా కొత్త బాక్సర్లను తీర్చిదిద్దడంలో నిమగ్నమయ్యానని తెలిపింది. ‘నేను అకాడమీ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నా. మణిపూర్‌లోని ప్రస్తుత పరిస్థితుల వల్ల అక్కడికి వెళ్లడం కొన్నిసార్లు కష్టమవుతోంది. అయినప్పటికీ వేరే మార్గాల ద్వారా పనులను పర్యవేక్షిస్తున్నా. వయసుతో సంబంధం లేకుండా వీలైనంత కాలం దృఢంగా ఉండటమే నా లక్ష్యం’ అని మేరీ కోమ్ వివరించింది.
