బంగ్లాదేశ్లో మరో ఇద్దరు హిందువుల హత్య

బంగ్లాదేశ్లో మరో ఇద్దరు హిందువుల హత్య
  •     24 గంటల్లో రెండు మరణాలు
  •     పోలీసు కస్టడీలో అవామీ లీగ్ లీడర్ అనుమానాస్పద మృతి
  •     మరో ఘటనలో ఆటోడ్రైవర్​ను కొట్టి, పొడిచి చంపిన దుండగులు

ఢాకా: బంగ్లాదేశ్​లో హిందువులపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో మరో ఇద్దరు హిందువులు చనిపోయారు. పబ్నాలో పోలీసు కస్టడీలో ఉన్న అవామీ లీగ్​ లీడర్  ప్రొలోయ్  చాకి అనుమానాస్పద స్థితిలో చనిపోగా.. చిట్టగాంగ్​ లో ఒక ఆటోడ్రైవర్ ను దుండగులు కొట్టి, పొడిచి చంపేశారు. ఈ రెండు ఘోరాలూ ఈ నెల 11న జరిగాయి. 2024లో విద్యార్థి ఉద్యమానికి సంబంధించిన బ్లాస్ట్ కేసులో ప్రొలోయ్ (60) ను పోలీసులు గత నెల 16న అరెస్టు చేశారు. జైల్లో పోలీసు కస్టడీలో ఉన్న ఆయన.. ఆదివారం అనుమానాస్పదంగా చనిపోయారు. కార్డియాక్ అరెస్టుతో ఆయన చనిపోయారని జైలు అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, తన తండ్రిని అకారణంగా అరెస్టు చేశారని ఆయన కుమారుడు సోని చాకి వాపోయారు. ‘‘డయాబెటీస్, హార్ట్ డిసీజెస్​తో మా నాన్న కొద్దిరోజులుగా బాధపడుతున్నారు. జైల్లో ఆయనను సరిగ్గా చూడలేదు. ట్రీట్​మెంట్ కూడా అందించలేదు. దాంతో ఆరోగ్యం విషమించి ఆయన చనిపోయారు. మా నాన్నది సహజ మరణం కాదు. జైలు అధికారులు చేసిన హత్య” అని సోని ఆరోపించారు.

ఎలక్ట్రిక్  ఆటోను ఎత్తుకెళ్లిన హంతకులు

చిట్టగాంగ్​లో మరో హిందూ యువకుడిని దుండగులు అత్యంత దారుణంగా చంపేశారు. బాధితుడి ఎలక్ట్రిక్  ఆటోను ఎత్తుకెళ్లారు. మృతుడిని సమీర్  దాస్​గా గుర్తించారు. చిట్టగాంగ్​లో సమీర్  ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాడు. ఆదివారం రాత్రి ఆయనను కొంతమంది దుండగులు అడ్డుకొని తీవ్రంగా కొట్టి, కత్తులతో పొడిచి హత్య చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. బంగ్లాదేశ్​లో హిందువులపై జరుగుతున్న హింసను భారత విదేశాంగ శాఖ ఖండించింది.