ఓల్డ్ సిటీ, వెలుగు: హైదరాబాద్లోని కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. జియాగూడలోని వెంకటేశ్వర నగర్ ప్రాంతంలో నిర్వహించిన దాడిలో కుళ్లిపోయిన కూరగాయలు, నాసిరకం పచ్చళ్లు, చింతపండు పేస్ట్, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని తయారీదారులైన ఇద్దరు అన్నదమ్ములను అరెస్ట్ చేశారు.
విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ఎస్సై ఎం. నరసింహ తన సిబ్బందితో కలిసి హౌస్ నంబర్ 13-3-596/C/1లో ఉన్న గోదాముపై తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
నిందితులు పలు మార్కెట్ల నుంచి కుళ్లిపోయిన కూరగాయలు, నాణ్యత లేని ముడి పదార్థాలను తీసుకొచ్చి పచ్చళ్లు తయారు చేస్తున్నారు. ఈ పచ్చళ్లను డ్రమ్ముల్లో నిల్వ ఉంచి నగరంలోని పలు దుకాణాలకు తక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఈ దాడిలో 72 డ్రమ్ముల వివిధ రకాల పచ్చళ్లు (నిమ్మకాయ, పండు మిర్చి, చింతకాయ, ఉసిరి, గోంగూర), ఆరు డ్రమ్ముల టమోటా, చింతపండు పేస్ట్, ఒక డ్రమ్ము అల్లం-వెల్లుల్లి పేస్ట్, వెయింగ్ మెషీన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎన్. నరసింహ (54), ఎన్. నరేశ్ (45) అనే అన్నదమ్ములపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ రాములు తెలిపారు.
