ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం.. ఇంట్లో చెప్పకుండా సిటీకి..

ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం.. ఇంట్లో చెప్పకుండా సిటీకి..
  • చార్మినార్​ చూసేందుకు వచ్చామన్న ఛత్తీస్​గఢ్​ మైనర్లు
  • పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించిన రైల్వే పోలీసులు

సికింద్రాబాద్, వెలుగు: రెండు నెలల కింద ఇన్​స్టాగ్రామ్​లో ఏర్పడిన పరిచయంతో ముగ్గురు మైనర్లు చార్మినార్ చూడాలని ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ కు వచ్చారు. సికింద్రాబాద్​రైల్వేస్టేషన్​లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా రైల్వే పోలీసులు పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్​గఢ్​కు చెందిన కిరణ్​సింఘా(16), శివమ్​మిశ్రా(17), హెన్​పుష్పా పటేల్(15) వేర్వేరు స్కూళ్లలో పది, తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వీరి ముగ్గురికి ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం ఏర్పడింది. ఎగ్జామ్స్​అయిపోగానే చార్మినార్​చూడాలని ప్లాన్​చేసుకున్నారు. ఇంట్లో చెప్పకుండా ఈ నెల 28న రాయ్​పూర్​లో కోర్బా- – యశ్వంత్ పూర్ ట్రైన్​ఎక్కి, శుక్రవారం ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్​లో దిగారు. చార్మినార్​ఎలా వెళ్లాలి అని స్టేషన్​లో ఎంక్వైరీ చేస్తుండగా, పోలీసులు గమనించారు. అనుమానంతో ముగ్గురిని విచారించగా తాము చార్మినార్​చూసేందుకు ఛత్తీస్​గఢ్​నుంచి వచ్చినట్లు తెలిపారు. పోలీసులు వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా గురువారం నుంచి ముగ్గురు పిల్లలకు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు స్థానిక పటేవా పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్​ కేసులు నమోదయ్యాయి.