- ఇప్పటి వరకు పోలీసుల అదుపులో నలుగురు !
- రెండు, మూడు రోజుల్లో పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసు కొలిక్కి
- ఇంకా పరారీలోనే ప్రధాన సూత్రధారి షాబుద్దీన్ పఠాన్
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ పట్టణంలోని పీఎంజే జ్యువెల్లరీ షాప్‌లో కిలోన్నర బంగారం దోపిడీ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం వరకు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. అదే రోజు రాత్రి మరో ఇద్దరిని పట్టుకున్నట్లు సమాచారం. దోపిడీ ఘటనలో మొత్తం ఐదుగురు పాల్గొనగా.. ఇప్పటికే నలుగురు పోలీసులకు చిక్కడంతో రెండు, మూడు రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి అయిన షాబుద్దీన్ పఠాన్ మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదని తెలిసింది. అతడు దొరికాకే ముఠా వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
వేర్వేరు చోట్ల బంగారం అమ్మకం
ఈ నెల 3న కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీలో దోచుకెళ్లిన బంగారాన్ని ఈ ముఠా వేర్వేరు వ్యక్తులకు అమ్మినట్లు తెలిసింది. మహారాష్ట్రలోకి ప్రవేశించాక ఐదుగురు ఒకే చోట ఉండకుండా ఎవరి వాటా బంగారం వారు తీసుకుని అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బెంగాల్‌లో ఒక దొంగ దగ్గర బంగారం కొనుగోలు చేసిన వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతడు ఇచ్చిన సమాచారంతోనే తొలుత ఒక దొంగను, ఆ తర్వాత ఒక్కొక్కరిగా మిగతా ముగ్గురిని పట్టుకున్నట్లు సమాచారం.
దొంగలందరినీ బిహార్‌లోనే అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దోపిడీ ప్రధాన సూత్రధారి షాబుద్దీన్ పఠాన్ ఇంకా దొరకకపోవడంతో పోలీసులు గాలింపు తీవ్రం చేసినట్లు తెలిసింది. అతడిని కూడా అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం పూర్తి స్థాయిలో బంగారం రికవరీ చేశాకే పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చూపే అవకాశాలు
కనిపిస్తున్నాయి.
