ఐటీ శాఖ నుంచి కాంగ్రెస్​కు మరో రెండు నోటీసులు

ఐటీ శాఖ నుంచి కాంగ్రెస్​కు మరో రెండు నోటీసులు

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ నుంచి కాంగ్రెస్ పార్టీకి మరో రెండు నోటీసులు వచ్చాయి. ఇప్పటికే 2017–-18 నుంచి 2020-–21 వరకు పెనాల్టీ, వడ్డీతో కలిపి రూ.1,800 కోట్లకు పైగా చెల్లించాలని శుక్రవారం ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, అదేరోజు రాత్రి ఆదాయపు పన్ను శాఖ నుంచి మరో రెండు నోటీసులు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

శనివారం ఆ పార్టీ జాతీయ కార్యదర్శి జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ..​ శుక్రవారం రాత్రి  ఐటీ శాఖ మరో రెండు నోటీసులు పంపినట్లు వెల్లడించారు. ఉదయం పంపిన నోటీసులను సవరిస్తూ మొత్తం రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ ఈ నోటీసులలో పేర్కొన్నట్లు  చెప్పారు. కాగా, ప్రధాని మోదీ ప్రతిపక్షాల ఉనికి కనిపించకుండా చేయాలనుకుంటున్నారని జైరాం రమేశ్​ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు బీజేపీ ప్రభుత్వం ట్యాక్స్ టెర్రరిజానికి పాల్పడుతోందని ఫైర్​ అయ్యారు.

మరో నేత అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. బీజేపీ కట్టాల్సిన సుమారు రూ.4,600 కోట్ల పెనాల్టీ సొమ్మును వసూలు చేసేందుకు ఆ పార్టీకి కూడా నోటీసులు పంపాలని డిమాండ్ చేశారు. లోక్‌‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌‌ పార్టీ బ్యాంకు ఖాతాను స్తంభింపజేయడం ద్వారా ఆర్థికంగా కాంగ్రెస్‌‌ను బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాకెన్‌‌ ఆరోపించారు.