మలక్‌‌‌‌పేట్ ఆస్పత్రిలో మరో ఇద్దరు బాలింతలకు సీరియస్

మలక్‌‌‌‌పేట్ ఆస్పత్రిలో మరో ఇద్దరు బాలింతలకు సీరియస్

హైదరాబాద్, వెలుగు: మలక్‌‌‌‌పేట్ ఏరియా హాస్పిటల్‌‌‌‌లో ఆపరేషన్లు వికటించిన ఘటనలో మరో ఇద్దరు బాలింతలు సీరియస్‌‌‌‌గా ఇన్ఫెక్షన్​కు గురయ్యారు. ప్రస్తుతం నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో వారు ట్రీట్​మెంట్ పొందుతున్నారు. ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉండడం, కిడ్నీల పనితీరు మందగించడంతో శనివారం బాధితులకు డయాలసిస్‌‌‌‌ చేయించారు. ఇప్పుడు వారి పరిస్థితి కొంత మెరుగుపడిందని, నాలుగైదు రోజుల్లో కోలుకుంటారని డాక్టర్లు అంటున్నారు. మలక్‌‌‌‌పేట్‌‌‌‌ హాస్పిటల్ నుంచి గురువారం ఎనిమిది మంది బాలింతలను నిమ్స్‌‌‌‌కు తరలించగా, వారిలో ఒకరిని కుటుంబ సభ్యులు ప్రైవేటు హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లారు. మిగిలిన ఏడుగురిలో ఇద్దరు ఎమర్జెన్సీ వార్డులో డయాలసిస్‌‌‌‌పై ఉన్నారు. ఇంకో ఐదుగురి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిసింది. ఇన్ఫెక్షన్‌‌‌‌కు గల కారణాలు తెలుసుకునేందుకు టెస్టులు చేయగా ఏడుగురి బ్లడ్ శాంపిల్స్‌‌‌‌లో స్టెఫలోకోకస్ అనే బ్యాక్టీరియా తేలింది. బ్యాక్టీరియా సోకుతుందన్న భయంతో మలక్‌‌‌‌పేట్ ఏరియా హాస్పిటల్‌‌‌‌లో ఉన్న మరో 11 మంది బాలింతలను కూడా శనివారం నిమ్స్‌‌‌‌కు తరలించారు. కేవలం ముందు జాగ్రత్త చర్యగానే వీరిని షిఫ్ట్ చేశామని, ఎవరికీ ఇబ్బంది లేదని డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి ఆంక్షలు ఉండడంతో బాధితుల ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన చేయడానికి నిమ్స్‌‌‌‌ డాక్టర్లు, మలక్‌‌‌‌పేట్ హాస్పిటల్‌‌‌‌ డాక్టర్లు ముందుకు రాలేదు. కాగా, నిమ్స్​లో బాలింతలను మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. 

కిడ్నీలపై బ్యాక్టీరియా ఎఫెక్ట్‌‌‌‌

నిరుడు ఆగస్ట్‌‌‌‌లో ఇబ్రహీంపట్నం కమ్యునిటీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల అనంతరం, ఇన్ఫెక్షన్ల బారిన పడి నలుగురు బాలింతలు మరణించారు. 25 మంది ఇన్ఫెక్షన్లతో దవాఖాన పాలయ్యారు. వీరందరికీ స్టెఫలోకోకస్ అనే బ్యాక్టీరియా సోకినట్టు ఎక్స్‌‌‌‌పర్ట్ కమిటీ గుర్తించింది. బ్యాక్టీరియా కారణంగా ఆపరేషన్లు జరిగిన ఒకట్రెండు రోజుల్లోనే కిడ్నీలు ఫెయిలై  ముగ్గురు మృతిచెందినట్టు ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది. ఇప్పుడు మలక్​పేట ఘటనలో కూడా బాలింతలకు అదే బ్యాక్టీరియా సోకింది. చనిపోయిన శివాని, సిరి వెన్నెల కిడ్నీలు కూడా దెబ్బతిన్నట్టు పోస్ట్‌‌‌‌మార్టంలో తేలింది. కానీ, ఈ విషయాన్ని సర్కార్ బయటపెట్టడం లేదు. మరో ఇద్దరు బాలింతలు సైతం కిడ్నీ ఇన్ఫెక్షన్‌‌‌‌తో నిమ్స్‌‌‌‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

సర్కార్‌‌‌‌‌‌‌‌పై డాక్టర్ల గుస్సా

స్టెఫిలోకోకస్ బ్యాక్టీరియా సర్జరీల కోసం వాడే ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌, హాస్పిటల్‌‌‌‌ వాతావరణం లో ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆపరేషన్ థియేటర్‌‌‌‌‌‌‌‌, సర్జరీల కోసం వాడే పరికాల స్టెరిలైజేషన్‌‌‌‌ సరిగా జరగకపోతే ఆపరేషన్లు జరిగిన సమయంలో పేషెంట్‌‌‌‌కు బ్యాక్టీరియా సోకే ప్రమాదం ఉంటుంది. సర్జరీకి ముందు స్టెరిలైజేషన్ కోసం ఆటోక్లేవ్ యంత్రాలను వినియోగిస్తారు. హాస్పిటళ్లకు సర్కార్ సప్లై చేస్తున్న ఆటోక్లేవ్ యంత్రాలు నాసిరకంగా ఉన్నాయని, అవికూడా సరిపడా ఇవ్వడం లేదని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్‌‌‌‌ సమయంలో వినియోగించే సర్జికల్ గౌన్లు కూడా సరిపడా సప్లై చేయడం లేదని, దీంతో ఒకే గౌనుతో రోజంతా గడపాల్సి వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉన్నా, అది ఆపరేషన్లు జరిగిన పేషెంట్లు అందరికీ వ్యాపించే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.