ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్

ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్
  •     పరారీలో మరో నిందితుడు

మేడిపల్లి, వెలుగు: ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్న ఇద్దరిని ఎల్ బీనగర్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా రాంనగర్ కాలనీకి చెందిన ముదం రవి(40), జైపూర్ కాలనీకి చెందిన సయ్యద్ నౌషద్(36) ఇద్దరూ ఫ్రెండ్స్. వీరిద్దరూ స్థానికంగా ఎంఆర్ స్టడీ సర్కిల్, వికాస్ స్టడీ సర్కిల్ పేరుతో స్టడీ సెంటర్లను నడుపుతున్నారు. తమ స్టడీ సెంటర్ లో చేరిన స్టూడెంట్లకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే.. పలు విద్యాసంస్థలకు చెందిన ఇంటర్ తో పాటు బీటెక్, బీకాం, బీఈడీ, బీఎస్సీ సర్టిఫికెట్లను ఇప్పిస్తామనని చెప్పి డబ్బులు వసూలు చేసేవారు. 

బోడుప్పల్ లోని బాలాజీనగర్ కు చెందిన రవిశంకర్ రెడ్డి ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేస్తున్నాడు. అతడికి బ్యాగ్ లాగ్స్ ఉండటంతో డిస్టెన్స్ లో బీటెక్ పూర్తి చేసేందుకు ముదం రవి, నౌషద్ ను సంప్రదించాడు. రవిశంకర్ నుంచి రూ. లక్షా 50 వేలు తీసుకుని బీటెక్ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే, రవిశంకర్  ఆ సర్టిఫికెట్ లో ఉన్న వర్సిటీ పేరును ఆన్ లైన్ లో చెక్ చేయగా.. నకిలీ అని తేలింది. మోసపోయినట్లు తెలుసుకున్న రవిశంకర్ మేడిపల్లి పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. 

ఎల్ బీనగర్ ఎస్ వోటీ పోలీసులు ముదం రవి, నౌషద్ కు చెందిన స్టడీ సెంటర్లపై దాడులు చేశారు. వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పలు విద్యాసంస్థల పేరుతో ఉన్న ఫేక్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వీరికి ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి ఇస్తున్న పంజాబ్ కు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు.