మనోళ్ల కోసం రెండు ప్రత్యేక విమానాలు

మనోళ్ల  కోసం రెండు ప్రత్యేక విమానాలు
  • ప్రకటిచిన కేంద్ర  ప్రభుత్వం
  • హంగేరీ, రుమేనియా మీదుగా తరలించేలా ప్లాన్

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌‌‌‌లో చిక్కుకుపోయిన మనోళ్లను హంగేరీ, రుమేనియా మీదుగా ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మెడికల్ స్టూడెంట్లందరినీ ప్రభుత్వ ఖర్చులతోనే తీసుకొస్తామని శుక్రవారం తెలిపింది. ఇందులో భాగంగా 2 ప్రత్యేక విమానాలను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు వివరించారు. ఇప్పటికే రోడ్డు మార్గంలో ఉక్రెయిన్ నుంచి సుసీవా బార్డర్ ను దాటి రొమేనియాలోకి ఫస్ట్ బ్యాచ్ కింద పలువురు ఇండియన్ లు చేరుకున్నారని, వీరిని బుకారెస్ట్ కు తరలించి, అక్కడి నుంచి ఇండియాకు తీసుకువస్తామని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ నుంచి పోరుబ్నే సిరత్ వద్ద బార్డర్ దాటి 470 మంది స్టూడెంట్లు రుమేనియాకు చేరుకోనున్నారని కీవ్ లోని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. కాగా,  ఉక్రెయిన్ లో 16 వేల మంది ఇండియన్ లు ఉండగా, వీరిలో అత్యధిక మంది స్టూడెంట్లే ఉన్నారు. రొమేనియా సరిహద్దుకు చేరుకుంటున్న మనవాళ్లను ఎంబసీ అధికారులు బుకారెస్ట్​కు తీసుకెళ్తారు. అక్కడ్నుంచి ఇండియన్లు, మెడికల్ స్టూడెంట్లతో ప్రత్యేక విమానాలు శనివారం తిరుగు ప్రయాణమవుతాయని అధికారులు తెలిపారు. దీనిపై ఎప్పటికప్పుడు స్టూడెంట్లకు సమాచారం ఇస్తున్నామన్నారు. ఉక్రెయిన్​లో ఉన్న మనోళ్లంతా సరిహద్దుల్లోని​ చెక్​పోస్టులకు ప్రయాణిస్తున్నప్పుడు కార్లకు, బస్సులకు తప్పనిసరిగా మన జాతీయ జెండాను అతికించాలని అధికారులు కోరారు. అంతకుముందు, మెడికల్ స్టూడెంట్లను తొలి ప్రాధాన్యతగా ఇండియాకు తీసుకురావాలని ప్రధాని మోడీని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్ఏ) కోరింది. అక్కడున్నోళ్లంతా ప్రయాణ ఖర్చులను భరించే స్థితిలో లేరని, ఆర్థికంగా సాయంచేయాలని లేఖలో విజ్ఞప్తి చేసింది.
బ్రిటన్ విమానాలపై రష్యా నిషేధం
ఉక్రెయిన్ పై దాడిని వ్యతిరేకిస్తూ రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేలా బ్రిటన్ ఆంక్షలు విధించింది. దీనికి కౌంటర్​గా బ్రిటన్​విమానాలు తమ గగనతలంలోకి రాకుండా పుతిన్ నిషేధం విధించారు. ఈ నిషేధం శుక్రవారం నుంచే అమలవుతుందని ప్రకటించారు.