- ఇద్దరికి తీవ్ర గాయాలు
అశ్వారావుపేట, వెలుగు: భూ తగాదాలో ఇరువర్గాలు కత్తులతో దాడులు చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంకు పట్టాపు శ్రీహరి వద్ద ఐదెకరాల భూమిని కొన్నాళ్ల కింద మంగా వెంకటేశ్వర్లు, మంగా గణేశ్ కొనుగోలు చేసి అరటితోట సాగు చేశారు. కాగా.. మూడు నెలల కింద ఆ భూమి తనదేనంటూ అదే గ్రామానికి చెందిన గేదెల విష్ణు కుటుంబ సభ్యులు వెళ్లి అరటి తోటను ధ్వంసం చేశారు.
దీనిపై వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సోమవారం పొలం వద్దకు వెళ్లిన వెంకటేశ్వర్లు, గణేష్ కుటుంబ సభ్యులను అడ్డుకొని గేదెల విష్ణు కుటుంబ సభ్యులు గొడవ పడ్డారు. ఆపై విష్ణు మనవడు, కొడుకు కలిసి కత్తులతో దాడికి పాల్పడగా పొలంలోనే కుప్పకూలి పడిపోయారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యానికి ఖమ్మం తరలించారు. గేదెల విష్ణు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యయాతి రాజు తెలిపారు.
