జమ్మూ కాశ్మీర్‎లో భారీ ఎన్ కౌంటర్.. భద్రతా దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్‎లో భారీ ఎన్ కౌంటర్.. భద్రతా దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం (ఆగస్ట్ 28) బందిపోరా గురేజ్ సెక్టార్‌లోని నౌషెహ్రా నార్డ్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి ఇద్దరు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన దళాలు ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసిందని అధికారులు తెలిపారు. ఇద్దరు చొరబాటుదారులను భద్రతా దళాలు మట్టుబెట్టాయని వెల్లడించారు. 

ఘటన స్థలంలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి బలగాలు. ఈ నెల (ఆగస్ట్) ప్రారంభంలో కూడా జమ్మూ కాశ్మీర్‎లో ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఆపరేషన్ అఖల్ పేరుతో బలగాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ చేపట్టారు. ఈ ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది సైన్యం. ఒక జవాన్ గాయపడ్డాడు. 2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన నాటి నుంచి సరిహద్దుల్లో భద్రతా దళాలు హై అలర్ట్‎గా ఉంటున్నాయి. 

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎల్‎వోసీ గుండా భారత్‎లోకి అక్రమంగా ప్రవేశించి దేశంలో విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందన్న ఇంటలిజెన్స్ సమాచారంతో బార్డర్‎లో బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఎల్వోసీ వెంబడి పాక్ డ్రోన్లు సంచరించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. పాక్ కవ్వింపులతో భారత సైన్యం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు టెర్రరిస్టులను ఎన్ కౌంటర్ చేసింది.