చొరబాటుకు యత్నించిన ఇద్దరు టెర్రరిస్టులు హతం

చొరబాటుకు యత్నించిన ఇద్దరు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి టెర్రరిస్టుల చొరబాటు యత్నాన్ని భారత ​భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రిస్టులు హతమయ్యారు. 

కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్‌లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలం నుంచి 2 ఏకే రైఫిళ్లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కుప్వారా సీనియర్ ఎస్పీ యోగుల్ మన్హాస్ తెలిపారు. మరో ఇద్దరు చొరబాటుదారుల కోసం ఆర్మీ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. 

భారీగా ఆయుధాలను కలిగి ఉన్న టెర్రరిస్టుల టీం చొరబాటుకు ప్రయత్నిస్తున్నదని జమ్మూ కాశ్మీర్ పోలీసులకు అందిన పక్కా సమాచారం ఆధారంగా ఆపరేషన్ చేపట్టారు. మచిల్ సెక్టార్‌లోని కుంకడి ప్రాంతంలో చొరబాటుదారులను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. అలాగే, దక్షిణ కాశ్మీర్‌లోని త్రాల్ ప్రాంతంలో టెర్రరిస్టుల రహస్య స్థావరాన్ని ధ్వంసం చేశాయి. ఈ సోదాలలో ఎలాంటి ఆయుధాలు లభించలేదు.