ఇద్దరు యువ రాజులు.. బీహార్​లోనూ ఫెయిలే

ఇద్దరు యువ రాజులు.. బీహార్​లోనూ ఫెయిలే

రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్​పై ప్రధాని మోడీ పరోక్ష విమర్శలు

సింహాసనాలను కాపాడుకోవడంపైనే యువరాజుల దృష్టి

ఎన్నికలప్పుడే వాళ్లకి పేదలు గుర్తుకొస్తరు.. మహాకూటమిని చెడు ఆహారం

పటేల్ జయంతిని కాంగ్రెస్ మరిచిపోయిందని మండిపాటు

మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని ప్రధాని ధీమా

ఛప్రా/సమస్తిపూర్/మోతిహారి/బగాహ: ‘‘అభివృద్ధి చేసిన డబుల్ ఇంజిన్ ఎన్డీయే ప్రభుత్వం ఇటు వైపున ఉంది. తమ సింహాసనం కాపాడుకోవడమే ఎజెండాగా పని చేస్తున్న డబుల్ డబుల్ యువరాజ్ (రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్​లను ఉద్దేశిస్తూ..) అటువైపున ఉన్నారు. డబుల్ యువరాజ్​లో ఒకరు (రాహుల్​ను ఉద్దేశిస్తూ) కొన్నేళ్ల కిందట ఉత్తర ప్రదేశ్​లో ఒక కూటమి ఏర్పాటు చేశారు. ఆయన రాష్ట్రమంతా తిరిగాడు. కానీ కూటమి చిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడు ఆ యువరాజు బీహార్​లో ఉన్నాడు. ‘యువరాజ్ ఆఫ్ జంగల్ రాజ్’​కు సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్లు ఇక్కడా ఫెయిల్ అవుతారు’’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీహార్​లోని ఛప్రా, సమస్తిపూర్​లలో జరిగిన ర్యాలీల్లో పీఎం మాట్లాడారు.

డబుల్ యువరాజ్ వర్సెస్ డబుల్ ఇంజిన్ ఎన్డీయే

బీహార్​లో ఒకవైపు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్న ఎన్డీయే ఉందని, మరోవైపు వంశపారంపర్య రాజకీయాలకు అంకితమైన కూటమి ఉందని ప్రధాని అన్నారు. జంగల్​ రాజ్ వైపు డబుల్ యువరాజ్ నిలబడ్డారని, లాంతర్ల యుగం నుంచి బీహార్​ను బయటికి తీసుకొచ్చిన డబుల్ ఇంజిన్ ఎన్డీయేకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష కూటమికి ఎన్నికల సయమంలోనే పేదలు గుర్తుకు వస్తారని విమర్శించారు. తమ సింహాసనాలను కాపాడుకోవడంపైనే డబుల్ యువరాజ్ దృష్టి అని విమర్శించారు. ‘‘నితీశ్ బంధువు ఎవరైనా రాజ్యసభకు వెళ్లారా? మోడీ బంధువు ఎవరైనా పార్లమెంటులో ఉన్నారా?” అని మోడీ ప్రశ్నించగా.. ప్రజలంతా ‘లేదు’ అంటూ బదులిచ్చారు.

ప్రత్యర్థులు ఫ్రస్ట్రేట్ అవుతున్నరు

లాలు, రబ్రీ ప్రభుత్వాల సమయంలో కిడ్నాపర్ల రాజ్యం నడిచిందని మోడీ ఆరోపించారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిని తిరస్కరించాలని ప్రజలను కోరారు. ‘‘చెడు ఆహారం అజీర్ణానికి కారణమవుతుంది. ఇంకోసారి ఆ ఫుడ్ తినొద్దని మన మనస్సు నిర్ణయించుకుంటుంది’’ అని అన్నారు. ‘‘తొలిదశ పోలింగ్.. ఎన్నికల ఎక్స్​పర్టుల అంచనాలు తప్పని నిరూపించింది. ఎన్డీయే మరోసారి అధికారంలోకి రాబోతోంది. దీంతో మా ప్రత్యర్థులు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు” అని ఎగతాళి చేశారు. లాలూ ఫ్యామిలీ అవమానించడం వల్లే కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్​చనిపోవడానికి ఒకరోజు ముందు పార్టీని వదిలి వెళ్లిపోయారన్నారు.

అబద్ధాల మీద అబద్ధాలు

‘‘ప్రతిపక్ష నేతలు అమాయకంగా ముఖంపెట్టి ఒకదాని తర్వాత ఒకటి అబద్ధాలు చెబుతున్నారు. ఆర్టికల్​370 రద్దుచేస్తే కాశ్మీర్ ​కాలిపోతుందన్నరు. కానీ కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. సీఏఏ విషయంలోనూ తప్పుడు ప్రచారాలు చేశారు..ఏడాది గడిచింది. ఒక్కరి సిటిజన్​షిప్ అయినా పోయిందా?’’ అని ప్రశ్నించారు.

ఢిల్లీలో మీ బిడ్డ ఉన్నడు

కరోనా వ్యాప్తిని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పండుగ పూట ఇంట్లో పొయ్యి ఆరిపోనివ్వకుండా చూసుకుంటానని మోడీ హామీ ఇచ్చారు. ‘‘నా తల్లులు వర్రీ కావాల్సిన పని లేదు. ఛాత్ ఉత్సవాలను ఎలా జరుపుకోవాలనే ఆందోళన వద్దు. మీ కొడుకు ఢిల్లీలో కూర్చున్నాడని గుర్తుంచుకోండి. అతను మీ అవసరాలనుచూసుకుంటాడు’’ అని కామెంట్ చేశారు. ‘‘వల్లభ్​భాయ్​పటేల్ ఆర్ఎస్ఎస్​కు చెందిన వారా? లేక జనసంఘ్బీ, జేపీకి చెందిన వ్యక్తా? ఆయన కాంగ్రెస్ లీడర్. కానీ ఆయన జయంతిని అదే పార్టీ మరిచిపోయింది” అని విమర్శించారు.