
హైదరాబాద్: తెలంగాణలో దారుణం జరిగింది. JEE మెయిన్స్‌లో అనుకున్న ర్యాంక్ రాలేదని ఒక యువకుడు.. బీటెక్‌లో ఫెయిల్ అయ్యానని మరొ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా బాల్య తండాకు చెందిన దారవత్ రాందాస్ కుమారుడు దారవత్ ప్రవీణ్ కుమార్ (20) నారాయణగూడలోని అభ్యశ్రీ బాయ్స్ హాస్టల్లో ఉంటూ.. జేఈఈ మెయిన్స్‌కు ఢిల్లీ కు చెందిన ఓ ఇనిస్టిట్యూట్ ఆన్లైన్ క్లాస్‌లలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.
అయితే ఇటీవల విడుదలైన ఫలితాల్లో ప్రవీణ్ కుమార్ క్వాలిఫై కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 12న తల్లిదండ్రులకు చివరిగా ప్రవీణ్ కుమార్ ఫోన్ చేసి మాట్లాడాడు. 13న తల్లిదండ్రులు ప్రవీణ్ కు ఫోన్ చేయగా.. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో వారు బుధవారం (మే 14) ఉదయం హాస్టల్‌కు వచ్చి చూడగా ప్రవీణ్ కుమార్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. ఘటన స్థలానికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి కీర్తి వివేక్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బీటెక్ మొదటి చదువుతోన్న వివేక్.. ఇటీవల వెలువడిన ఫస్ట్ సెమిస్టర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వివేక్.. కత్తితో మెడ, చేయి కోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. అధిక రక్తస్రావం కావడంతో అతడు మృతి చెందాడు. మృతుడు వివేక్ తండ్రి మేళ్ళ చెరువు మండలం హేమాల తండాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. చేతికి వచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.