- ఈ నెల 22న హైదరాబాద్‌లో విచారణకు రావాలని నోటీసులు
- ప్రశ్నించే వారు లేకుండా చేసేందుకు కేసు పెట్టిన్రు : రంగారావు
ఖమ్మం/ఖమ్మంటౌన్, వెలుగు : సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుపై ఉపా కేసు నమోదైంది. గతేడాది నవంబర్‌లో మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని రంగారావుకు నోటీసులు జారీ చేయడంతో కేసు విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఎన్ఐఏ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.
ఉపా చట్టాన్ని ప్రశ్నించినందుకే కేసు
ఖమ్మం టౌన్, వెలుగు : గాదె ఇన్నయ్య, వరవరరావు, రామచంద్రరావుపై పెట్టిన ఉపా చట్టాన్ని ప్రశ్నించడంతో కక్షపూరిత చర్యల్లో భాగంగానే తనపై ఉపా కేసు పెట్టారని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రశ్నించే హక్కు లేకుండా చేసేందుకే ఉపా చట్టాన్ని ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలకు భయపడేది లేదన్నారు.
నోటీసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కేజీ.రామచంద్రరావు, కె.రమ, సూర్యం, కృష్ణ, ఎస్ఎల్ పద్మ, సదానందం, కెచ్చల రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పాల్గొన్నారు.
