ఈ ఉగాదికి.. ఏం చేయాలి..? ఏం చేయకూడదు..?

ఈ ఉగాదికి.. ఏం చేయాలి..? ఏం చేయకూడదు..?

భారతీయ సంస్కృతిలో కాలానికి, ప్రకృతికి, మానవ జీవితానికి ఉన్న సంబంధాన్ని ప్రతిబింబించే  పండుగలలో  ఉగాది విశిష్ట స్థానం పొందింది. తెలుగు ప్రజల నూతన సంవత్సర ఆరంభాన్ని సూచించే ఈ పండుగ కేవలం క్యాలెండర్ మార్పు కాదు. జీవన విధానంలో కొత్త దిశను ఆవిష్కరించే సాంస్కృతిక సంకేతం. ‘ఉగాది’ అనే పదం ‘యుగాది’ నుంచి ఉద్భవించింది. ‘యుగం’ అంటే కాలపరంపర, ‘ఆది’ అంటే ఆరంభం. అంటే  కొత్త యుగానికి శ్రీకారం చుట్టే సందర్భం.

పురాణ పరంపర ప్రకారం ఈ రోజునే సృష్టికర్త బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించడం ప్రారంభించాడని విశ్వాసం. అందువల్ల ఈ పండుగకు కేవలం సామాజికమే కాక ఆధ్యాత్మిక పరిమాణం కూడా ఉంది. ఉగాది పండుగ ప్రకృతి చక్రంతో సన్నిహిత సంబంధం కలిగి ఉంది. వసంత ఋతువు ఆరంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఈ పండుగ వస్తుంది. చెట్లు కొత్త కొమ్మలు విరిసే కాలం, పూలు వికసించే సమయం, పంటలు కోతకు వచ్చే దశ. ఈ సమస్తం జీవన పునరుద్ధానానికి ప్రతీకలు. ఈ నేపథ్యమే ఉగాదిని ‘పునర్జన్మ  పండుగ’గా  నిలబెడుతున్నది.

ఆరు రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి
ఉగాది ఆచారాల్లో అంతర్లీనమైన తాత్వికత ప్రత్యేకంగా గమనించదగ్గది. ఉదయం స్నానం చేసి, ఇంటిని శుభ్రపరచి, మామిడి తోరణాలతో అలంకరించడం..  ఇది కేవలం అలవాటు కాదు.  అది శరీర–మనస్సు శుద్ధికి సూచకం. ఇంటి ముందర రంగవల్లులు వేయడం సౌందర్యానికే కాదు, శుభానికి సంకేతం. ఈ పండుగలో  ప్రధాన ఆకర్షణగా నిలిచేది ‘ఉగాది పచ్చడి’. 

చింతపండు (పులుపు), బెల్లం (తీపి), వేపపువ్వు (చేదు), మిరప (కారం), ఉప్పు (ఉప్పదనం), మామిడి (తురుము రుచి) – ఈ ఆరు రుచుల సమ్మేళనం జీవనంలో ఎదురయ్యే ఆరు అనుభూతులను సూచిస్తుంది. ఆనందం, దుఃఖం, కోపం, భయం, ఆశ, విరక్తి..ఈ భావాలను సమానంగా స్వీకరించగలగడం జీవన పరిపక్వతకు సూచిక అని ఈ పచ్చడి మనకు బోధిస్తుంది. ఈ భావనలోనే  భారతీయ తత్వశాస్త్రం ప్రతిఫలిస్తుంది.

పంచాంగ శ్రవణం
పంచాంగ శ్రవణం ఉగాది పండుగకు మరో ముఖ్యాంశం. పండితులు నూతన సంవత్సరానికి సంబంధించిన గ్రహస్థితులు, వర్షపాతం, వ్యవసాయ పరిస్థితులు, రాజకీయం, ఆర్థిక పరిస్థితులపై విశ్లేషణ చేస్తారు. ఇది కేవలం జ్యోతిష్య ప్రక్రియ  మాత్రమే కాదు.  సమాజానికి దిశానిర్దేశం చేసే సంప్రదాయం. భవిష్యత్తుపై అవగాహన పెంపొందించి,  ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. 

ఆధునిక యుగంలో వేగవంతమైన జీవనశైలితో  మనిషి ప్రకృతికి దూరమవుతున్న సందర్భంలో ఉగాది పండుగ మనలను మూలాలకు తీసుకువెళ్తుంది. కొత్త సంకల్పాలు చేసుకోవడం,  గతంలోని అపజయాలను పాఠాలుగా స్వీకరించడం, భవిష్యత్తును ఆశావహంగా స్వాగతించడం వంటి సానుకూల దృక్పథాన్ని ఈ పండుగ ప్రోత్సహిస్తుంది.

జీవన సత్యాలకు అద్దం పట్టే తాత్వికోత్సవం
పురాణ ప్రాశస్త్య దృష్ట్యా ఉగాది మరింత విశిష్టమైనది.  బ్రహ్మ పురాణం, పద్మ పురాణం వంటి గ్రంథాలలో చైత్ర మాస శుక్ల పాడ్యమి రోజున సృష్టి ఆరంభమైందని పేర్కొనడమైంది.  ఈ రోజున  కాలగమనానికి రూపురేఖలు ఏర్పడి నక్షత్రాలు,  గ్రహాలు తమ గమనాన్ని ప్రారంభించాయని  విశ్వాసం. అందువల్ల ఈ రోజు దేవతారాధన, హోమాలు, పూజలు చేయడం పుణ్యప్రదంగా భావిస్తారు. ఆచరణ పరంగా ఉగాది మనిషి జీవితానికి నియమ శీలతను నేర్పుతుంది.

తెల్లవారుజామున లేచి నూనె రాసుకుని స్నానం చేయడం, కొత్త వస్త్రాలు ధరించడం, దేవునికి నైవేద్యాలు సమర్పించడం, పంచాంగ శ్రవణం వినడం వంటి ఆచారాలు క్రమశిక్షణను పెంపొందిస్తాయి. పెద్దలను దర్శించి ఆశీర్వాదాలు తీసుకోవడం ద్వారా కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. మొత్తంగా, ఉగాది పండుగ కాల గమనానికి ఆరంభమే కాదు జీవన సత్యాలకు అద్దం పట్టే తాత్వికోత్సవం. నేడు పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా అందరికీ సుఖసంతోషాలు కలగాలని ఆశిద్దాం.

రామకిష్టయ్య సంగనభట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.

* రచన 700 పదాలకు మించరాదు.