- వైరస్ లక్షణాలతో బెంగళూరులో ఐసోలేషన్‌లో ఉన్న ప్రయాణికురాలు
బెంగళూరు/మాస్కో: ఎబోలా లక్షణాలతో బెంగళూరులో ఐసోలేషన్‌లో ఉన్న ఉగాండా మహిళకు నెగెటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారతదేశంలో ఇప్పటివరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని, సదరు ప్రయాణికురాలి ఆరోగ్యం స్థిరంగా ఉందని స్పష్టం చేసింది. ఈ నెల 23న ఉగాండా నుంచి అహ్మదాబాద్ మీదుగా కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఈ మహిళను ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను పర్యవేక్షించే ఆఫీసర్లు గుర్తించారు.
ఆమెలో అలసట, స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఇందిరానగర్‌లోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆస్పత్రికి తరలించారు. ఐసోలేషన్‌లో ఉంచి, ఎబోలా పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. మరో 48 గంటల పరిశీలన తర్వాత ఆమెకు మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో తాము పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం.. కర్ణాటక ప్రభుత్వం, ఇతర సంస్థల సమన్వయంతో విమానాశ్రయాలు, నిఘా కేంద్రాల వద్ద తనిఖీలు కొనసాగుతున్నట్లు పేర్కొంది.
ముందస్తు ఏర్పాట్లు
ఎబోలా అప్రమత్తత నేపథ్యంలో కర్నాటక ఆరోగ్య శాఖ.. బెంగళూరులో రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్‌ను ఐసోలేషన్ కేంద్రంగా, అంటువ్యాధుల ఆస్పత్రిని క్వారంటైన్, చికిత్సా కేంద్రంగా కేటాయించినట్లు మంత్రి దినేశ్‌గుండూరావు తెలిపారు. మంగళూరులో న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ పరిధిలోని శ్రీనివాస్ పోర్ట్ హాస్పిటల్‌ను క్వారంటైన్ కేంద్రంగా, వెన్‌లాక్ జిల్లా ఆస్పత్రిని ఐసోలేషన్, చికిత్సా కేంద్రంగా గుర్తించామన్నారు.
కొత్త వ్యాక్సిన్ తెచ్చినట్లు రష్యా ప్రకటన
రష్యా ఇటీవల కొత్త రకం బుందిబుగ్యో ఎబోలా వైరస్ స్ట్రెయిన్ నిరోధానికి సరికొత్త వ్యాక్సిన్‌ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్ట్రెయిన్‌కు అధికారికంగా ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఇప్పుడు రష్యా తెచ్చిన వ్యాక్సిన్ దీనిపై సమర్థంగా పని చేస్తుందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో తెలిపారు. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ డేటా, శాస్త్రీయ ఆధారాలు ఇంకా బయటపెట్టలేదని, అంతర్జాతీయ గుర్తింపు, నిపుణుల సమీక్ష తర్వాతే దాని భద్రత, సమర్థతపై స్పష్టత వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎర్వెబో వంటి వ్యాక్సిన్లు కేవలం జైర్ ఎబోలా స్ట్రెయిన్‌పైనే పని చేస్తాయని, వైరస్ నియంత్రణకు వేగంగా గుర్తింపు, ఐసోలేషన్, కాంటాక్ట్ ట్రేసింగ్ మాత్రమే ప్రధాన మార్గాలని పేర్కొంటున్నారు.
