తీహార్ జైలులో సౌలతులపై బ్రిటన్ బృందం సంతృప్తి

తీహార్ జైలులో సౌలతులపై బ్రిటన్ బృందం సంతృప్తి
  • తీహార్ జైలులో సౌలతులపై బ్రిటన్ బృందం సంతృప్తి
  • నీరవ్ మోదీ, మాల్యా అప్పగింత వ్యవహారంలో జైలు పరిశీలన
  • అంతర్జాతీయ ప్రమాణాలకు సమీపంగా ఉందన్న సీపీఎస్ బృందం
  • ఆర్థిక నేరస్తులను అప్పగించాలని కొన్నేండ్లుగా కోరుతున్న ఇండియా


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో ఖైదీలకు కల్పించిన సౌలతులపై బ్రిటన్ అధికారుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఖైదీల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) అధికారులు.. అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా ఉందని పేర్కొన్నారు. పలువురు ఖైదీలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు  జైలులోని సౌలతులను స్వయంగా పరిశీలించి ‘‘ గుడ్ సిస్టమ్’’ అని కితాబిచ్చారు. బ్రిటన్ లో తలదాచుకున్న ఆర్థిక నేరస్థులు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, సంజయ్ భండారీ తదితరులను భారత్ కు అప్పగించే ప్రక్రియలో భాగంగా సీపీఎస్ బృందం ఈ పర్యటన చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కిందటి జులై నెలలోనే ఈ పర్యటన జరగగా.. తాజాగా జైలులో ఏర్పాట్లపై సీపీఎస్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, సంజయ్ భండారీల అప్పగింత వ్యవహారం ముందుకు కదలనుందని తెలుస్తోంది.

అప్పగింతపై కోర్టుకెక్కిన సంజయ్

భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, సంజయ్ భండారీ తదితరులను అప్పగించేందుకు బ్రిటన్ మొగ్గు చూపగా.. సంజయ్ భండారీ దీనిని న్యాయస్థానంలో సవాల్ చేశారు. భారత్ లోని జైళ్లలో తనపై దౌర్జన్యం జరగొచ్చని, తన ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు.. నేరస్థుల అప్పగింతకు ముందు భారత్ లోని జైళ్లను పరిశీలించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్)  బృందంగత జులైలో ఢిల్లీలో పర్యటించింది. 

ఈ బృందంలో ఇద్దరు సీపీఎస్ నిపుణులు, ఇద్దరు బ్రిటిష్ హైకమిషన్ అధికారులు ఉన్నారు. తీహార్ జైలులోని అత్యంత భద్రత కలిగిన వార్డులను పరిశీలించిన ఈ బృందం, ఖైదీలకు అందించే సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించింది. ఈ సందర్భంగా అవసరమైతే అప్పగించిన ఖైదీల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తామని, వారి భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని తీహార్​జైలు అధికారులు హామీ ఇచ్చారు. ఈమేరకు అధికారులను నుంచి బ్రిటన్ బృందం రాతపూర్వక హామీ కూడా తీసుకుందని సమాచారం. కాగా, ప్రస్తుతం, భారత్ నుంచి 178 అప్పగింత అభ్యర్థనలు వివిధ దేశాల్లో పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. వీటిలో 20 బ్రిటన్‌‌‌‌ వద్దే ఉన్నాయి, ఇందులో విజయ్ మల్యా, నీరవ్ మోదీ, సంజయ్ భండారీతో పాటు కొందరు ఖలిస్తానీ నాయకులు ఉన్నారు. బ్రిటన్ బృందం తీహార్ జైలు పరిశీలన ఈ అప్పగింతల ప్రక్రియను స్పీడప్​చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.