రష్యాలో భారత కార్మికుడు మృతి..ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో దుర్మరణం

రష్యాలో భారత కార్మికుడు మృతి..ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో దుర్మరణం

మాస్కో: రష్యా రాజధాని మాస్కో రీజియన్‌‌లో ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించగా, మరో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. ఈ విషయాన్ని రష్యాలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) అధికారికంగా ధ్రువీకరించింది. రాయబార కార్యాలయ అధికారులు వెంటనే ఘటనాస్థలాన్ని సందర్శించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై భారత ఎంబసీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. బాధిత కార్మికులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి స్థానిక అధికారులు, సదరు కంపెనీ యాజమాన్యంతో కలిసి పనిచేస్తున్నట్లు 'ఎక్స్' వేదికగా వెల్లడించింది.

యుద్ధం మొదలయ్యాక ఇదే అతిపెద్ద దాడి
.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా భూభాగంపై ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటి. ఈ దాడుల కారణంగా మాస్కో పరిసర ప్రాంతాల్లో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖిమ్కి నగరంలో ఒక డ్రోన్ నివాస గృహాన్ని ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా, పోగోరెల్కి గ్రామంలో ఇద్దరు పురుషులు మరణించినట్లు స్థానిక గవర్నర్ ఆండ్రీ వోరోబ్యోవ్ తెలిపారు. మరోవైపు, మాస్కో నగరంలోని ఆయిల్ రిఫైనరీ ప్రవేశ ద్వారం వద్ద జరిగిన దాడిలో కనీసం 12 మంది గాయపడ్డారు. కాగా, గత 24 గంటల్లో రష్యా రక్షణ వ్యవస్థలు మొత్తం 1,000 కంటే ఎక్కువ ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసాయి. ఇందులో మాస్కో వైపు దూసుకొచ్చిన 81 డ్రోన్లు కూడా ఉన్నాయి.