ప్రభుత్వ కొలువు చేస్తుండని.. లక్షల కట్నమిచ్చి.. పిల్లనిచ్చి ధూంధాంగా పెండ్లి చేస్తే..

ప్రభుత్వ కొలువు చేస్తుండని.. లక్షల కట్నమిచ్చి.. పిల్లనిచ్చి ధూంధాంగా పెండ్లి చేస్తే..

అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చిందని ఎంతో సంతోషపడ్డారు. అబ్బాయి గవర్నమెంట్ కొలువు చేస్తున్నడు. ఇంకేం మరి.. కూతురి జీవితం బాగుంటుందని 30 గ్రాముల బంగారం, 10‌‌ లక్షల కట్నం ఇచ్చి.. మరో 20 లక్షలు ఖర్చుపెట్టి పెళ్లి ధూంధాంగా జరిపించారు. కానీ.. ఏడాది తిరిగే లోపే కూతురి శవాన్ని చూడాల్సొస్తుందని ఆ తల్లిదండ్రులు కలలో కూడా అనుకోలేదు. ఈ విషాద ఘటన కర్నాటకలోని భద్రావతి తాలూకాలో జరిగింది. గురురాజ్, లత పెళ్లి 2025 ఏప్రిల్లో జరిగింది.

గురురాజ్ ప్రభుత్వ ఉద్యోగి. భద్రావతిలోని భద్రావతి డ్యాం కేపీసీఎల్​లో ఏఈఈగా పనిచేస్తున్నాడు. పెళ్లైన రెండుమూడు నెలలు భార్యను మంచిగానే చూసుకున్న గురురాజ్ ఆ తర్వాత నుంచి అదనపు కట్నం కోసం టార్చర్ చేయసాగాడు. ప్రభుత్వ ఉద్యోగినని.. మరొకరిని పెళ్లి చేసుకుని ఉంటే ఇంతకు మించిన కట్నం వచ్చి ఉండేదని భార్యను నిత్యం సూటిపోటి మాటలతో వేధించాడు. గురురాజ్ కుటుంబ సభ్యులు కూడా అదనపు కట్నం కోసం లతను వేధించారు. ఇంట్లో ఏ ఒక్కరూ ఆమెతో మాట్లాడేవాళ్లు కాదు. కట్టుకున్న భర్త కూడా పురుగును చూస్తున్నట్టు చూస్తుండే సరికి లత తట్టుకోలేకపోయింది. 

ఇక ఈ బతుకు ఎందుకని నైరాశ్యంతో.. వైరాగ్యంతో భద్రా నదిలో దూకేసింది. వాట్సాప్లో ఆమె ఒక నోట్ రాసి చనిపోయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అత్తింట్లో తాను అనుభవించిన నరకాన్ని ఆమె తన డెత్ నోట్లో వివరించింది. గురురాజ్కు అతని అక్క కూతురితో వివాహేతర సంబంధం ఉందని లత తల్లి ఆరోపించింది. డబ్బు కోసం వెంపర్లాడి తమ కూతురికి ఈ గతి పట్టేలా చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని లత తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. లత తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.